ఇది ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నదంటే, అమెరికన్ల ఆలోచనలు కొన్ని చిత్రంగా ఉంటాయి. అక్కడి ఇళ్ల వరుసలలో 11,12 తర్వాత 14 ఉంటుందే గాని, 13 ఉండదట. ఎందుకంటే, 13 లాభదాయకం కాని సంఖ్య యని వారు భావిస్తారు. కాబట్టి దానిని తీసుకొనడానికి ఎవరూ ఇష్టపడరు, సాహసించరు. మరి ఒక ఇంటిని నిర్మించి, ఖాళీగా ఉంచట మెందుకు? అని 12తర్వాత 14 వేసుకొనడానికి వారు అలవాటు పడిపోయారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. తాత్కాలిక అధ్యక్షుడిగా ఒకరు విధులు నిర్వహించట మనేది లేదు. ఏ కారణంచేత నైనా, అధ్యక్షుడు తన పదవీ బాధ్యతలనుండి వైదొలగితే, ఉపాధ్యక్షుడు అధ్యక్ష స్థానంలోకి వస్తాడు. పదవీకాలం పూర్తయ్యేవరకు అతడు ఆ స్థానంలో ఉండి బాధ్యతలు నిర్వహిస్తాడు. అధ్యక్షునికి ఉండే సమస్త అధికారాలూ ఈయనకూ ఉంటాయి.
గతంలో జాన్ ఎఫ్ కెన్నెడీ రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికైన కొద్ది నెలలకే హత్యకు గురైనాడు. ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన లిండెన్ బి. జాన్సన్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి దాదాపుగా నాలుగేళ్లపాటు పాలన సాగించాడు.
మరి మనదేశంలో ఎలాంటి ఏర్పాటు ఉందో చూద్దాం. ప్రధానమంత్రిగా ఉన్న జవాహర్ లాల్ నెహ్రూ 1964 మేలో మరణించగా, మంత్రుల్లో సీనియర్ ( హోం శాఖా మంత్రి) అయిన గుల్జారీలాల్ నందాకు తాత్కాలికంగా ప్రధానమంత్రి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంచేయించారు. కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశమై తమ నాయకునిగా లాల్ బహాదుర్ శాస్త్రిని ఎన్నుకోగా, అప్పుడు ఆయన ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించారు.
1966 జనవరిలో లాల్ బహాదుర్ శాస్త్రి మరణించగా, గుల్జారీలాల్ నందాకు తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరించేందుకు మరోసారి అవకాశం లభించింది. కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశమై తమ నాయకత్వం స్థానానికి ఇందిరాగాంధీని ఎన్నుకోగా, రాష్ట్రపతి ఆమె చేత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
1967లో రాష్ట్రపతిగా ఎన్నికైన జాకీర్ హుస్సేన్ 1969 లో మరణించారు. అప్పటి ఉపరాష్ట్రపతి వి వి గిరి తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించ
నారంభించినా, కొద్ది నెలలతర్వాత రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది. ఉపరాష్ట్రపతి గా ఉన్న వి వి గిరి తన పదవికి ( ఉపరాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి) రాజీనామా చేసి రాష్ట్రపతి స్థానానికి పోటీచేశారు. అదృష్టవశాన గెలుపొందారు కూడా.
ఇలా పోటీచేసి గెలిచిన వ్యక్తి పదవీకాలం పూర్తి అయిదేళ్లు. (ఇంతకు ముందు ఎన్నికైన వ్యక్తి మిగిల్చి పోయినా రెండున్నర సంవత్సరాలు మాత్రమే కాదు) అలా వి వి గిరి గారు 1974 వరకు రాష్ట్రపతిగా ఉండి పోయారు.
1974లో రాష్ట్రపతిగా ఎన్నికైన ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ 1977లో లోకసభ ఎన్నికలు జరుగబోతున్న సమయంలో మరణించారు. అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న బి డి జెత్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. లోకసభ ఎన్నికల అనంతరం క్రొత్తగా జనతాపార్టీ తరఫున నాయకునిగా ఎన్నికై వచ్చిన మురార్జీ దేశాయ్ చేత ఆయనే ప్రమాణస్వీకారం చేయించారు.
1974 లో ఎన్నికైన రాష్ట్రపతి పదవీకాలం 1979 వరకు ఉంది కాబట్టి జెత్తిగారు అప్పటివరకూ రాష్ట్రపతిగా కొనసాగే అవకాశం మన రాజ్యాంగం ఇవ్వలేదు. లోకసభ ఎన్నికలు జరిగిన రెండునెలలకే మళ్లీ రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించగా, నీలం సంజీవరెడ్డి ఎన్నికై రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. బి డి నెత్తి ఉపరాష్ట్రపతి స్థానంలో కొనసాగినారు.
కాగా 1984లో ప్రధానమంత్రిగా ఉండిన ఇందిరా గాంధీ హత్యకు గురైనప్పుడు రాష్ట్రపతి స్థానంలో ఉన్న జ్ఞానీ జైల్ సింగ్ క్రొత్త ఒరవడి సృష్టించారు. మంత్రుల్లో సీనియర్ అయిన వానిచేత తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారప్రమాణం చేయించే ఆనవాయితీకి భిన్నంగా మంత్రివర్గంలో సభ్యుడు కూడా కాని కాంగ్రెసు పార్టీ జనరల్ సెక్రటరీ అయిన రాజీవ్ గాంధీచేత ప్రధానమంత్రి గా (తాత్కాలిక ప్రధానమంత్రిగా కాదు) ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆ కార్యక్రమం జరిగిన తర్వాతనే, ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నాయకునిగా ఎన్నుకోబడటం జరిగింది. ( ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ చట్టం నిర్దేశాలను ఉల్లంఘించటమే. అయితే ఇందిరా గాంధీ హత్య జరిగిన దరిమిలా దేశమంతా నిర్ఘాంత పోయి ఉన్న సమయ మది. విధి విధానాల గురించి ప్రశ్నించే స్థితిలో ఎవరూ లేనందున అలా జరిగి పోయింది.)
తాత్కాలిక ప్రధానమంత్రిగా ఒకరిని నియమించే అవకాశాన్ని దాటుకొనిపోయిన సందర్భం ఇది కాగా, 1999లో కే ఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఉండగా, ఇంతకంటే విచిత్రమైన స్థితి ఏర్పడింది. అటల్ బిహారీ వాజపేయి గారి ప్రభుత్వం బడ్జెట్ ను చర్చకు పెట్టేందుకు లోకసభ సమావేశం జరుగుతున్న సమయంలో ఆలిండియా అన్నా డిఎంకె ప్రధాన కార్యదర్శి యైన జయలలిత కేంద్రంలోని వాజపేయి మంత్రివర్గానికి మద్దతు ఉపసంహరించుకొంటూ రాష్ట్రపతికి ఒక లేఖ నిచ్చి తెలియపరిచారు. బలాబలాలను తేల్చే వేదిక అయిన లోకసభ సమావేశంలో ఉంది. రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. అయినా, ఆయన ప్రధానమంత్రి వాజపేయిని పిలిచి సభలో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు.అపుడు సభలో విశ్వాసనిర్ధారణ తీర్మానం ప్రవేశ పెట్టగా విచిత్రపరిస్థితుల మధ్య ఒక వోటు తేడాతో అది వీగి పోయింది. వాజపాయి తన మంత్రివర్గం రాజీనామాను రాష్ట్రపతికి అందజేశారు. ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం ఏర్పరచడం ఎవరికీ సాధ్యంకాని స్థితి ఏర్పడం తో అంతకుముందు ఏ రాష్ట్రపతి తీసుకోని నిర్ణయాలు కే ఆర్ నారాయణన్ తీసుకోవాల్సి వచ్చింది.వివిధ పక్షాల నాయకులను పిలిచి లోకసభను రద్దు చేయటం అనివార్యంగా కనబడుతున్నది, లోకసభ ఎన్నికలు వీలైనంత త్వరగా జరుగుతాయని చెప్తూ, బడ్జెట్ ఆమోదింపబడనిస్థితిలో లోకసభ రద్దయితే ఆర్థిక సంక్షోభాలు, రాజ్యాంగసంక్షోభమూ ఏర్పడే స్థితి ఉంది గనుక సభ సమావేశమై ఆర్థికమంత్రికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడానికి అవకాశమివ్వాలని,ఎటువంటి చర్చా లేకుండా దానిని ఆమోదించాలని, ఆ తర్వాతనే లోకసభను రద్దు చేసే ప్రకటన ఇస్తామని చెప్పారు.రోటిలో తల ఇరుక్కుపోయిన స్థితి అది. ఎవరూ కూడా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయడానికి వెసులుబాటు కనబడని స్థితిలో అంగీకారం తెలిపారు. మళ్లీ ఎన్నికలు జరిగి క్రొత్త ప్రధానమంత్రి ఎవరో తేలేవరకు రాజీనామా సమర్పించిన ప్రధానమంత్రియే విధుల్లో కొనసాగడానికి సమ్మతించారు. ఆ సమయంలో కార్గిల్ వద్ద యుద్ధం నడిచింది. తాత్కాలిక ప్రధానమంత్రిగానే వాజపేయి ఆ సమయంలో గురుతర బాధ్యతలు నిర్వహించారు. 1999 ద్వితీయార్ధంలో జరిగిన ఎన్నికలలో వాజపేయి మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనారు.మళ్లీ ఒకసారి అమెరికా పరిణామాలను పరిశీంచుదాం. నూతనంగా (రెండవసారి) అధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి 2025 జనవరిలోపల బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం లేదు. అప్పటివరకు ఎన్నికల్లో ఓడిపోయిన డెమొక్రటిక్ పార్టీ నాయకుడైన జో బిడెన్ అధ్యక్షుడుగా కొనసాగటం వారి ఆనవాయితీ.
ఇప్పుడు ఆయనమీద ఒత్తిడి పెరుగుతున్నది-మీరు రాజీనామా చేసి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న కమలా హారిస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం కల్పించా లని, తద్వారా ఒక మహిళకు అటువంటి ఉన్నతస్థానాన్ని కల్పించిన ఘనత డెమొక్రటిక్ పార్టీకి దక్కాలనీ కొందరు సూచిస్తున్నారు.
అన్ని వేదికలమీద స్పష్టమైన ఆధిక్యం నిరూపించుకున్న ట్రంప్ గారు అక్కడ వేచిఉండగా, స్పష్టంగా ఓటమి చెందిన కమలా హేరిస్ ని ఈ యాబై రోజులకోసం అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టటం సమంజసమైన పనేనా?
ఏమో! అమెరికన్ మేధావుల ఆలోచనలు మనకు అర్థం కావు. పెద్దపిల్లికోసం పెద్ద కన్నం, చిన్నపిల్లికోసం చిన్నకన్నం ఏర్పాటుచేయాలని వారు అంటుంటే, నివ్వెరపోయి చూడటమే మనవంతు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం