దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు

దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు
 
భారత్ తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు చేపట్టింది. రోదసీలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తోంది. ‘అంతరిక్ష అభ్యాస్‌’ పేరిట సోమవారం ఢిల్లీలోని ఈ విన్యాసాలు ప్రారంభమైనట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వెల్లడించారు. 
 
దేశ రక్షణ యంత్రాంగంలో నేడు అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం దీనిని నిర్వహిస్తోందని అనిల్ చౌహన్ పేర్కొన్నారు. అంతరిక్షంలో మన సాధన సంపత్తికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
 
సోమవారం మొదలైన ఇవి మూడు రోజుల పాటు బుధవారం వరకూ ఇవి జరుగుతాయని తెలిపింది. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (డీఎస్‌ఏ) వీటిని నిర్వహిస్తోందని పేర్కొంది. రోదసిలో రద్దీ, పోటీ, వాణిజ్య ప్రయోజనాలు పెరుగుతున్నాయని చౌహాన్‌ అన్నారు. ఈ నేపథ్యంలో నవకల్పన, ఆధునాతన పరిజ్ఞానం, ఇస్రో, డీఆర్‌డీవోతో భాగస్వామ్యంతో రోదసిలో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

‘ఈ విన్యాసాలు జాతీయ వ్యూహాత్మక లక్ష్యాలను కాపాడుకోడానికి, సైనిక కార్యకలాపాలలో భారత అంతరిక్ష సామర్థ్యాన్ని ఏకీకృతం చేయడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు… అంతరిక్ష పరిశోధనల గొప్ప వారసత్వం, పెరుగుతున్న సైనిక, అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, భారత్‌ను ఉన్నత స్థితిలో ఉంచుతుంది’ అని జనరల్ అనిల్ చౌహన్ పేర్కొన్నారు.

ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలకు చెందిన విభాగాలు, రక్షణ సైబర్‌ సంస్థ, రక్షణ నిఘా సంస్థ, వ్యూహాత్మక దళాల విభాగం, ఇస్రో, డీఆర్‌డీవో ప్రతినిధులు పాల్గొంటున్నారు. అంతరిక్ష అభ్యాస్ ముఖ్య లక్ష్యం రోదసీ ఆధారిత ఆస్తులు, సేవలపై అవగాహన, వాటాదారుల మధ్య కార్యాచరణపై అవగాహన పెంచడమే. మరోవైపు, అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అమెరికా, చైనా, రష్యాలకు దీటుగా ఎదుగుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గతేడాది చేపట్టిన చంద్రయాన్-3, ఆదిత్య ఎల్ 1 వంటి ప్రయోగాలు విజయవంతమైన విషయం తెలిసిందే.