కర్ణాటకలో మరో రూ. 40,000 కోట్ల భారీ కుంభకోణం

కర్ణాటకలో మరో రూ. 40,000 కోట్ల భారీ కుంభకోణం
ముడా, వక్ఫ్‌ భూములు, వాల్మీకి కార్పొరేషన్‌, లిక్కర్‌ స్కామ్‌ల తర్వాత కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో మరో భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ)లో ఘన వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్ట్‌ను లోపభూయింష్టంగా ఓ కంపెనీకి అప్పగించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. 
 
దీంతో రూ. 40 వేల కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు అవినీతి నిరోధక ఫోరమ్‌ అధ్యక్షుడు ఎన్నార్‌ రమేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు 1,570 పత్రాలతో కూడిన సాక్ష్యాలను ఫిర్యాదుతో సహా అందజేశారు.

ఎన్నార్‌ రమేశ్‌ ఆరోపణల ప్రకారం బీబీఎంపీ పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కాంట్రాక్ట్‌ రమ్మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే, టెండరింగ్‌ నియమాలను పాటించకుండా ముందస్తు ఒప్పందంలో భాగంగానే 25 ఏండ్ల పాటు ఈ పనులను సదరు కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని రమేశ్‌ ఆరోపించారు. 

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఓ కంపెనీకి ఇంతపెద్ద కాంట్రాక్ట్‌ను ఎలా అప్పగిస్తారని మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్‌లోని 33 మంది మంత్రులకు ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో రూ. 40 వేల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టిందని ధ్వజమెత్తారు. దీనిపై పారదర్శకమైన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకుండానే లెక్కకుమించిన కుంభకోణాలు రాష్ట్రంలో వెలుగుచూడటంపై సీఎం సిద్ధరామయ్య సర్కారుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 

ముఖ్యంగా వక్ఫ్‌ భూములకు సంబంధించి హౌజింగ్‌ శాఖ మంత్రి బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎక్సైజ్‌ శాఖలో అధికారుల బదిలీలు, షాపుల లైసెన్సుల జారీకి భారీగా వసూళ్లకు తెగబడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపుర్‌, బెళగావి తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగి మరణంలో మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ అనుచరుడి పాత్రపై వార్తలు రావడం వెరసి.. ఆయా మంత్రులపై కాంగ్రెస్‌ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వీరికి త్వరలోనే అధిష్ఠానం నుంచి నోటీసులు రావొచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలు రాష్ట్ర ఖజానాకు భారంగానే మారాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు ఒప్పుకొన్నారు. అయితే, ఈ హామీలను నిలిపేయబోమని తెలిపారు. కాగా, రాష్ట్ర బడ్జెట్‌కు మించి గ్యారెంటీలు ఇవ్వొద్దని, అలా చేస్తే రాష్ర్టాలు దివాలా తీసే దుస్థితి వస్తుందని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల కాంగ్రెస్‌ నాయకులకు చురకలు అంటించడం తెలిసిందే.