దేశంలో ఇంకా దాస్య భావన పోలేదు

దేశంలో ఇంకా దాస్య భావన పోలేదు
విశాల హృదయం కలిగిన భారతదేశంలో వనరులకు కొరత లేదంటూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆలోచన లేని విద్యావిధానమే కొనసాగుతోందని, దేశంలో ఇప్పటికీ దాస్య భావన పోలేదని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి  ఆవేదన వ్యక్తం చేశారు. 

 
హిందూ ఆధ్యాత్మిక & సేవా ఫౌండేషన్ (హెచ్ఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం సేవాప్రదర్శిని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ వేద విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న భారతదేశంలో సహజత జీవించే ఉందని, మన భూమికి సహజసంపద, సౌందర్యం, సౌగంధ్యం, రుచి ఉన్నాయని జీయర్ స్వామి వివరించారు. 
 
భారతీయతను ఆచరిస్తూ లోక క్షేమాన్ని, విశ్వ కళ్యాణాన్ని కోరుకునే  వ్యక్తులు సంస్థలను హెచ్ఎస్ఎస్ఎఫ్ ఒక చోటికి చేర్చిందని ప్రశంసించారు. ఈ బృహత్ మేళా భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మన దేశానికి ఒక ఆత్మ ఉన్నదని చూపించే సంకల్పంతోనే ఏర్పాటైన ఈ సేవాప్రదర్శినిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

మానవుడు దైవాన్ని చేరుకునే ప్రయాణంలో సాధనగా మన రుషులు సేవామార్గాన్ని మనకు చూపించారని,  హెచ్ఎస్ఎస్ఎఫ్ సేవాప్రదర్శిని దానిని ప్రతిబింబిస్తోందని రామకృష్ణ మిషన్, విజయవాడ నుంచి విచ్చేసిన స్వామి శితికంఠానంద కొనియాడారు. 

 
సనాతన ధర్మంలో త్యాగానికి ప్రతినిధులుగా నిలిచిన దధీచి, జీమూతవాహనుడు, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు వంటి వారిని ఉదహరిస్తూ సమాజం గుర్తింపును ఆశించకుండా సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థల ఈ సేవాప్రదర్శిని ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని అభిలాషను వ్యక్తం చేశారు.
 
సేవ ద్వారా మాత్రమే అహంకారం నిర్మూలన జరుగుతుందన్న స్వామి రంగనాథానంద బోధను ప్రస్తావిస్తూ ఈ సేవా మేళాలు భాగంగా జరుగనున్న కన్యావందనం, గురువందనం, మాతా పితృ వందనం కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య ప్రసంగిస్తూ భారతీయ సమాజ మౌలిక స్థితి, సాంస్కృతిక తత్వం, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా  హెచ్ఎస్ఎస్ఎఫ్ సేవాప్రదర్శిని నిలుస్తుందని తెలిపారు. సేవకు ప్రతిమూర్తిగా నిలిచిన శ్రీకృష్ణుడి వారసులైన భారతీయులు మన దేశంలోని ధార్మిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. 

 
బ్రిటిష్ వారు రాకముందు మనదేశంలో దారిద్ర్యమే లేదని, విదేశీ దురాక్రమణ తర్వాత కూడా మన గ్రామాలు సుసంపన్నంగానే ఉన్నాయని భాగయ్య తెలిపారు. దేశంలోని ధర్మశాలలకు ప్రజలే దాతలుగా నిలిచారంటూ 1785 వ సంవత్సరం వరకూ తమిళనాడు నుంచి బరంపురం వరకూ ఉన్న సుమారు లక్ష పాఠశాలలకు ప్రజలు, రైతులే అండగా నిలిచారని, వాటిలో సమస్త కులాల వారు విద్యను అభ్యసించేవారని విశాల భారతీయ తత్వాన్ని సభకు తెలిపారు.
 
 రామకృష్ణ మఠం, సత్యసాయి సంస్థలు, మాతా అమృతానందమయి సంస్థలు, సేవాభారతి వంటి ఎన్నో సంస్థలు సేవానిరతిని భాగయ్య ప్రస్తావించారు. అమెరికా, కెన్యా వంటి దేశాల్లో సైతం భారతీయులందిస్తున్న సేవలను తెలియజేస్తూ హెచ్ఎస్ఎస్ఎఫ్ సేవాప్రదర్శినిలో ఆ స్ఫూర్తిని చూడవచ్చని చెప్పారు.

హెచ్ఎస్ఎస్ఎఫ్ – ఐఎంసిటిఎఫ్ అఖిలభారత సంయోజకులు గుణవంత్ సింగ్ కొఠారి  హైందవ ధర్మంలోని సేవానిరతిని చాటేందుకే దీనిని ఏర్పాటు చేశామంటూ వివిధ రాష్ట్రాలలో గతంలో నెలకొల్పిన మేళా వివరాలు, సంస్థల గురించి తెలియజేశారు. ఘనంగా ప్రారంభమైంది. పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవాసంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సేవావ్రతులైన వ్యక్తులు, మఠమందిరాలు, సమాజానికి అందిస్తున్న సేవలకు సంబంధించిన బృహత్ మేళాగా ఈ సేవా ప్రదర్శిని ఏర్పాటైంది.  ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం అధ్యక్షత  వహించారు.