ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నకిలీ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి అనిత తీసుకెళ్లారు.
చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు.
తానూ నకిలీ పోస్టు బాధితురాలునే అంటూ అనిత పవన్ కల్యాణ్తో చెప్పారు. అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ వివరాలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ చర్చించారు. హోమ్ మంత్రి అనిత, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ భేటీలో పాల్గొన్నారు.
తన కుమార్తె కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే తానే హోంమంత్రి పదవి సైతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రంలో అధికారులపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, అధికారి నిజాయతీతో ఉండాలని సూచించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్తో భేటీపై హోంమంత్రి అనిత సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
తాజాగా పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కార్యాలయంలో కలుసుకోవడంతో పాటు, సరదాగా నవ్వుతూ కనిపించారు. అదే విధంగా తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సైతం ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వాటిని చూసి వారు కన్నీరు పెట్టుకోవడంతో ఆవేదన చెందానని పవన్ వెల్లడించారు.
ఇంట్లోంచి బయటకు రావడానికి తన బిడ్డలు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనితతో కూడా పవన్ చెప్పారు. పవన్ కల్యాణ్, అనిత భీటీతో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని మరోసారి చెప్పకనే చెప్పినట్లైంది. దీంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైఎస్సార్సీపీకి తాజా ఫొటోలతోనే సమాధానం చెప్పారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు