స్కామ్‌లకు అడ్డాగా కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

స్కామ్‌లకు అడ్డాగా కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం
కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం స్కామ్‌లకు అడ్డాగా మారిపోయింది. ముడా, వాల్మీకి, కేఐఏడీబీ, వక్ఫ్‌ కుంభకోణాలతో ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన సీఎం సిద్ధరామయ్య సర్కారుకు కొత్తగా మద్యం స్కామ్‌ మంటలు అంటుకొన్నాయి. ఎక్సైజ్‌ మంత్రి ఆర్బీ తిమ్మాపుర్‌ కనుసన్నల్లో రూ. 700 కోట్ల మేర మద్యం కుంభకోణం చోటుచేసుకొన్నదని కర్ణాటక వైన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఎక్సైజ్‌ శాఖలో నెలకొన్న అవినీతిని కట్టడి చేయాలంటూ గవర్నర్‌ కార్యాలయం, చీఫ్‌ సెక్రటరీ, కర్ణాటక లోకాయుక్తకు అసోసియేషన్‌ ఓ లేఖలో, ఈ-మెయిల్‌లో విజ్ఞప్తి చేసింది. ఇంగ్లిష్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఇండియా టుడే కథనం ప్రకారం.. అసోసియేషన్‌ ఈ-మెయిల్‌లో కింది విధంగా ఆరోపణలు చేసింది. ‘రాష్ట్రంలోని ఎక్సైజ్‌ శాఖలో పెద్దయెత్తున అవినీతి రాజ్యమేలుతున్నది. ఎక్సైజ్‌ శాఖామాత్యులు తిమ్మాపుర్‌, శాఖలోని ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా, దోపిడీకి పాల్పడుతున్నారు. 
 
డిపార్ట్‌మెంట్‌లో ఎవరైనా అధికారులు బెంగళూరు పరిధిలో బదిలీ కోరుకొంటే మంత్రి తిమ్మాపుర్‌ ఆయా అధికారుల నుంచి పెద్దయెత్తున డబ్బును లంచంగా స్వీకరించేవారు. ట్రాన్స్‌ఫర్‌ నిమిత్తం అవసరమైన ఆ డబ్బు కోసం సదరు అధికారులు మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళ్లకు తెగబడేవారు. 
 
సీఎల్‌7 బార్‌ (బార్లు, రెస్టారెంట్లకు కర్ణాటకలో ఇచ్చే లైసెన్సులు) లైసెన్సు కావాలంటే, నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 8.5 లక్షల వరకూ చెల్లించాలి. అయితే, అధికారుల సాయంతో మంత్రి తిమ్మాపుర్‌ మాత్రం లిక్కర్‌ షాప్‌ యజమానుల నుంచి సీఎల్‌7 లైసెన్స్‌ కోసం రూ.30-70 లక్షల వరకూ లంచం రూపంలో అదనంగా వసూలు చేసేవారు.ఇది చట్టానికి విరుద్ధం. గడిచిన ఏడాది వ్యవధిలో ఇలా దాదాపు వెయ్యి లైసెన్సుల ద్వారా రూ.300 కోట్ల నుంచి రూ.700 కోట్లకు పైగా మంత్రి అవినీతికి పాల్పడ్డారు. ఇక, ఎక్సైజ్‌ శాఖలో బదిలీల కోసం ఒక్కరోజులోనే ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది సూపరింటెండెంట్స్‌, 13 మంది డిప్యూటీ సూపరింటెండెంట్స్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌, 20 మంది ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి మంత్రి తిమ్మాపుర్‌ రూ.16 కోట్ల వరకూ వసూళ్లు చేశారు. 

కింది స్థాయి అధికారుల బదిలీ కోసం ఒక్కో డిప్యూటీ కమిషనర్‌ రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు వసూలు చేసేవారు. డిప్యూటీ కమిషనర్‌ బదిలీ కోసం మంత్రి తిమ్మాపుర్‌ రూ.3 కోట్ల వరకూ వసూలు చేసేవారు. ఇదో పెద్ద కుంభకోణం.

దీనిపై సత్వర విచారణ జరిపించాలని కోరుకొంటున్నాం’ అంటూ ‘హ్యూజ్‌ బ్రైబ్‌ అండ్‌ మనీలాండరింగ్‌ టుక్‌ ప్లేస్‌ ఇన్‌ ఎక్సైజ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌ బెంగళూరు ఇన్‌ ట్రాన్స్‌ఫరింగ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్స్‌ అండ్‌ టు కంట్రోల్‌ ఇల్లీగల్‌ కలెక్షన్‌ ఆఫ్‌ మనీ ఫర్‌ ఎలక్షన్‌ పర్పస్‌ ఫ్రమ్‌ ఎక్సైజ్‌ అఫీషియల్‌’ పేరిట అసోసియేషన్‌ ఈ-మెయిల్‌లో పేర్కొంది. 

లంచంగా స్వీకరించిన డబ్బును మంత్రి తిమ్మాపుర్‌ ఎన్నికల్లో వాడినట్టు ఆరోపించింది. దీనిపై గవర్నర్‌ కార్యాలయం ఆదేశాలతో లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. కాగా, 2013-18 మధ్య సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటకలో వెలుగుచూసిన టీఏ/డీఏ స్కామ్‌లోనూ ఆర్బీ తిమ్మాపుర్‌ ప్రధాన నిందితుడిగా ఉండటం గమనార్హం.