ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ అయిన ఎఎం/ఎన్ఎస్ ఇండియా రూ. 1.40 లక్షల కోట్ల వ్యయంతో అనకాపల్లి దగ్గర ఉక్కు కర్మాగారం నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు ముందుకు పడితే ఇటీవల కాలంలో ఏర్పాటు కానున్న అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ. 80 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల బ్లాస్ట్ ఫర్నేస్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. మొదటి దశ కోసం కంపెనీ 2,600 ఎకరాల భూమిని కోరినట్లు తెలిసింది.
ప్రాజెక్టు రెండో దశలో రూ. 60,000 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులు పెంచుకుంటారు. ఇక ఇందుకోసం అదనంగా 2,000 ఎకరాల భూమిని సంస్థ యాజమాన్యం కోరింది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పక్కనే దాదాపు 1,800 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, వాటిని పరిశీలించాలని ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు తెలిసింది.
2035 నాటికి 40 మిలియన్ మెట్రిక్ టన్నులకు తమ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా భావిస్తోంది. ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా ప్లాంట్ ఏర్పాటు కోసం సముద్ర తీర ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం చెబుతోంది. ఇందుకోసం.
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి, పోర్టు సౌకర్యాల లభ్యత వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు యాజమాన్య వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జులైలో ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య జరిగిన జూమ్ కాల్‌లో ఈ స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటు దిశగా అంగీకారం కుదిరినట్లు ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్