శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు
అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జోబైడెన్‌ హాజరయ్యారు. శ్వేతసౌధంలోని బ్లూరూమ్‌లో ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఆ ప్రదేశాన్ని దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఈ వేడుకలకు దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు.

వీరిలో కాంగ్రెస్‌ సభ్యులు, అధికారులు, కార్పొరేట్‌ దిగ్గజాలు ఉన్నారు. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ ప్రచార కార్యక్రమాల కారణంగా దీనికి గైర్హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో దీపావళి వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాట్లాడుతూ  తన యంత్రంగం విభిన్నమైన జాతులతో అమెరికాను ప్రతిబింబిస్తుందని చెప్పారు.

“అధ్యక్షుడిగా, వైట్ హౌస్‌లో ఇప్పటివరకు అతిపెద్ద దీపావళి సంబరాలను నిర్వహించడం నాకు గౌరవంగా ఉంది. నాకు, ఇది చాలా గొప్ప విషయం. సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్; దక్షిణాసియా అమెరికన్లు నా సిబ్బందిలో కీలక సభ్యులు. కమల నుండి డాక్టర్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు, అమెరికా లాగా కనిపించే పరిపాలనను కలిగి ఉండాలనే నా నిబద్ధతను నేను నిలబెట్టుకున్నందుకు గర్వపడుతున్నాను, ” అని అధ్యక్షుడు తెలిపారు. 

2003లో జార్జి బుష్‌ తొలిసారి శ్వేతసౌధంలో దీపావళి నిర్వహించారు. ఆ తర్వాత బరాక్‌ ఒబామా స్వయంగా ఓవల్‌ ఆఫీస్‌లో దీపం వెలిగించి పండుగను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సంప్రదాయాన్ని ట్రంప్‌ కొనసాగించారు. అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకల సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ప్రత్యేక సందేశాన్ని పంపారు. భారతీయ అమెరికన్‌ యూత్‌ యాక్టివిస్ట్‌ సుశ్రుతి అమూల, అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌ హెచ్‌.మూర్తి తదితరులు ప్రసంగించారు.

అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అన్నింటా భాగస్వామి అవుతున్న జాతిగా దక్షిణాసియా వాసులు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అమెరికన్ల జీవితాల్లో ప్రతిభాగాన్ని వారు సుసంపన్నం చేశారని, ఇప్పుడు దీపావళి వేడుకలు గర్వంగా, ఘనంగా శ్వేతసౌధంలో జరుగుతున్నాయని తెలిపారు.

”ఇది నా ఇల్లు కాదు.. మీది. ఈ దేశంలో వైవిధ్యం మనది. మనం చర్చిస్తాం, విభేదిస్తాం కానీ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనే దానిని విస్మరించం” అని సందేశంలో ఆమె తెలిపారు. అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్‌ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. ఆమె అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమతో కలిసి పండగ చేసుకొంటున్నందుకు అధ్యక్షుడికి ధన్యవాదాలు చెప్పారు.