అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, డేటా సెంటర్‌లు, కృత్రిమ మేధ, ఐటీ, గనులు, పోర్టులు, పర్యాటకం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా అదానీ గ్రూప్ నుంచి భారీ బృందం ఏపీకి తరలివచ్చింది.
ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అదానీ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం వివరాలను ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.
అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే ఏపీ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని తెలిపారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో ఏపీ దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భవానీ ద్వీపం,రాజధాని సీడ్ యాక్సెస్‌రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్లను కలుపుతూ రోప్‌వే నిర్మాణం చేపడతామంది.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అందుబాటులోకి అత్యుత్తమ రోప్‌వే తీసుకువచ్చి, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ – డీబీఎఫ్‌ఓటీ మోడల్‌లో ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ ప్రతిపాదించింది. డీబీఎఫ్‌ఓటీ విధానంలో విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకి 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది.
అప్పికొండ బీచ్ దీనికి అనుకూలమని ఇందుకు రూ.800 కోట్ల మేర పెట్టుబడి పెడతామని వివరించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచి నీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తామని తెలిపింది.
కృష్ణపట్నం పోర్టు సామర్థ్యం 78 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు, ఇప్పుడున్న 13 బెర్తుల సంఖ్యను 42కి పెంచుతామని అదానీ గ్రూప్ తెలిపింది. పోర్టు విస్తరణకు మరో 2189.86 ఎకరాలు అవసరమని 1033 ఎకరాల అటవీ భూమికి తొలిదశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వివరించింది. గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచుతామంది.
బీచ్‌శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులకు సంబంధించి తొలిదశలో రూ.3000ల కోట్ల నుంచి రూ.4000ల కోట్ల పెట్టుబడి పెడతామని పేర్కొంది. దీనివల్ల ప్రత్యక్షంగా 2000ల మందికి, పరోక్షంగా 4000ల నుంచి 5000ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి రూ.15,000ల కోట్ల నుంచి రూ.20,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. తద్వారా ప్రత్యక్షంగా 4000ల మందికి, పరోక్షంగా 8000ల నుంచి 10,000ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి ఆదాయం 30 ఏళ్లకు రూ.10,000ల కోట్ల ఆదాయం రానుందని వెల్లడించింది. టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా రూ.9000ల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కానుందని వివరించింది. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యాకేంద్రాలు, వర్క్‌షాప్‌ల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాధాన్య రంగంగా గుర్తించి ప్రత్యేక రాయితీలివ్వాలని కోరింది.
ఈ మేరకు వందశాతం ఎస్‌జీఎస్టీ, వ్యాట్ రీఎంబర్స్‌మెంట్, పెద్ద పరిశ్రమగా గుర్తించి పదేళ్లపాటు కరెంట్ సుంకంపై 100 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరింది. డిజిటల్, పునరుత్పాదక రంగాలు సంయుక్తంగా పనిచేయటం వల్ల రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో 17 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తమ ప్రణాళికలో వెల్లడించింది.
More Stories
హైడ్రామా మధ్య అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
మతమార్పిళ్లకు పాల్పడే, అభివృద్ధిని అడ్డుకొనే ఎన్జీవోల ఎఫ్సిఆర్ఏపై కన్నెర్ర
త్వరలోనే నీటితో నడిచే హైడ్రోజన్ రైలు