సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. నిరసనల పేరుతో నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఓ ఏఆర్ ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
క్రమశిక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా నిరసనలు తెలిపారన్న కారణంతో వీరిని తొలగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)లో సెలవులతోపాటు ఇతర అంశాలకు సంబంధించి అదనపు డీజీపీ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెటాలియన్ల సిబ్బంది, కుటుంబ సభ్యులు నిరసనలకు దిగారు.
ఆర్డర్లీ వ్యవస్థ, సెలవులు ఇవ్వకపోవడం, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొందరు పరిధి దాటి వ్యవహరించినట్లు పోలీసు శాఖ అంతర్గత విచారణలో తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిపై ఆర్టికల్ 311(2)(బి) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
నిరసనల పేరుతో బెటాలియన్లలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిరసనలు తెలిపిన మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. బెటాలియన్ సిబ్బంది తమ సమస్యలను దర్బార్లలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు.
కాగా, నెలరోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం నుంచి నవంబర్ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్టు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

More Stories
‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ పోస్టర్ ఆవిష్కరణ
కేశవ నిలయంలో “పంచ పరివర్తన్”పై ఏఐలో కార్యశాల
తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్