జన్వాడ ఫామ్‌హౌస్‌లో పార్టీ వ్యవహారంలో మాజీమంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేసినట్లు మోకిల పోలీసులు వెల్లడించారు. జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన విషయాలపై విచారించాల్సి ఉందని, ఇవాళ విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్నారు. అడ్రస్ ఫ్రూఫ్‌తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించాలని సూచించారు.
విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో మోకిల ఇన్‌స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాజ్ పాకాల నివాసానికి అతికించారు. ఈరోజు మోకిలా పీఎస్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని పేర్కొంటూ రాజ్ పాకాలకు మోకిలా ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీచేశారు.
ఈ నేపథ్యంలో రాజ్ పాకాల ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా పోలీసులు అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. భోజన విరామం తర్వాత జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి దీనిపై విచారణ చేపట్టారు. పోలీసుల ముందు హాజరుకావడానికి 2 రోజుల సమయం ఇచ్చారు. ఈ సమయంలోగా పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
మోకిలా పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఎట్టకేలకు కేటీఆర్ బావమరిది స్పందించారు. మోకిలా పోలీస్ స్టేషన్‌కు రాజ్ పాకాల న్యాయవాదులు చేరుకున్నారు. విచారణకు వచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని పాకాల న్యాయవాదులు పోలీసులను కోరారు.

More Stories
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!
‘కాషాయ జెండా’ తొలగింపుతో దుమారం
అప్పుల్లో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలు