సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమం!

సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమం!
* ఇరాన్ క్షిపణి వ్యవస్థ కోలుకోవడానికి మరో రెండేళ్లు!

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతీకారంగా ఇరాన్​ క్షిపణుల కేంద్రాలపై ఇజ్రాయెల్ శనివారం యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇవి తిరిగి కోలుకోవాలంటే చాలా సమయం పట్టవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

1989లో రుహోల్లా ఖొమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు 85 ఏళ్లు ఉంటాయి. అయితే, ఖమేనీ వారసుడిగా భావించిన ఇబ్రహీం రైసీ ఇటీవల హెలీకాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. తాజాగా ఖమేనీ ఆరోగ్యం కూడా విషమించడం వల్ల ఆయన రెండో కుమారుడు మెజ్తాబా (55) వారసుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంలో ప్రచురించింది.

శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ జరిపిన భీకర వైమానిక దాడులు ఇరాన్‌ క్షిపణి కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఆ దేశ క్షిపణుల్లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఐడీఎఫ్​ ధ్వంసం చేసినట్టు తెలిపాయి. దీంతో సొంతగా ఇరాన్‌ తయారు చేయలేని పరిస్థితి నెలకొంది. వీటిని చైనా లేదా మరేదైనా దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం.

ఖెబర్‌, హజ్‌ ఖాసీం బాలిస్టిక్ క్షిపణుల్లో ఇరాన్ ఘన ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇవే క్షిపణులను ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 1 దాడికి ఇరాన్‌ వినియోగించింది. దీనికి సంబంధించిన కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ కర్మాగారం ఇరాన్‌ మిసైల్‌ ప్రోగ్రామ్‌కు వెన్నెముకగా భావిస్తారు. దాడి దెబ్బకు అది పనికిరాకుండా పోయినట్టు అరబ్‌కు చెందిన ఎల్ఫా కథనం పేర్కొంది.

దాదాపు 20 హెవీ ఫ్యూయల్‌ మిక్సర్లు కూడా ధ్వంసమైనట్టు తెలిపింది. ఒక్కోదాని ఖరీదు 2 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇక్కడ ఆ మిక్సర్లను తిరిగి అమర్చాలంటే కనీసం ఏడాదిపైనే సమయం పడుతుందని ఎల్ఫా కథనంలో పేర్కొంది. ఉత్పత్తి పాత స్థితికి చేరాలంటే మాత్రం కనీసం రెండేళ్లు పట్టొచ్చని తెలిపింది. మరోవైపు ఇరాన్‌లోని పర్చిన్‌ సహా మరోచోట బాలిస్టిక్‌ మిసైల్‌ కాంప్లెక్సులు దెబ్బతిన్నట్లు ప్లానెట్ ల్యాబ్స్ ఉప గ్రహ చిత్రాలను విశ్లేషించిన ఇద్దరు అమెరికా పరిశోధకులు తెలిపారు.