ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఈడీ దర్యాప్తుపై రాజకీయ దుమారం 

ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఈడీ దర్యాప్తుపై రాజకీయ దుమారం 
 
కేంద్ర విచారణ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గత మూడు రోజులుగా ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ను విచారించడం తెలంగాణాలో రాజకీయ దుమారం రేపుతోంది. కేసీఆర్ హయాంలో జిల్లా కలెక్టర్ గా ధరణి పోర్టల్ లో అక్రమాలకు పాల్పడి భారీగా భూముల అక్రమ బదలాయింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. 
 
ఈడీ రంగంలోకి వచ్చి దర్యాప్తు చేపట్టే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆయార్పణలపై మౌనంగా ఎందుకు ఉన్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి గతంలో టిపిసిసి అధ్యక్షునిగా ఒక వంక రేవంత్ రెడ్డి, మరోవంక అప్పటి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నాలుగు జిల్లాలకు జూనియర్ అధికారులను కలెక్టర్లుగా నియమించి, వారితో ధరణి పోర్టల్ లతో అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
కేసీఆర్ హయాంలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయా కలెక్టర్లపై అధికారంలోకి వచ్చాక దర్యాప్తుకు ఆదేశించకుండా వారికి కీలక పోస్టింగులు కట్టబెట్టడం గమనిస్తే వారితో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు అమోయ్ కుమార్ విషయంలో ఈడీ నేరుగా ప్రవేశించి దర్యాప్తు జరపడం ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రం అవమాన పరచడంగా భావిస్తున్నారు. 
మరోవంక, ఈడీ రంగ ప్రవేశం చేసిన తర్వాత రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున కొత్త ఫిర్యాదులు అందుతున్నాయి. దాదాపు రూ. 1000 కోట్ల విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. 840 మంది ప్లాట్ ఓనర్స్‌ను అమాయకుమార్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. 
 
రెవెన్యూ రికార్డుల్లో ప్లాట్ ఓనర్ల పేర్లు ఉన్నప్పటికీ ఇతరుల పేర్ల మీద అక్రమంగా ధరణిలో చేర్చి భూములను ఇతరులకు బదులాయించినట్టు ఇడికి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టులో పోరాటం చేస్తున్నామని తెలిపారు. అమోయ్ కుమార్‌పై ప్రస్తుతం ఇడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును సైతం పరిగణలోకి తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. 
 
ఇక అటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ప్రభుత్వ భూమి వట్టినాగుల పల్లి, కాజాగూడా లోని పలు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పన్నంగా అప్పగించాడని అమోయ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్నది.   మొత్తం నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలాగా అమోయకుమార్ భూముల కేటాయింపు జరిపాడని ఆరోపణలు వస్తున్నాయి.