‘ధరణి’ పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత

‘ధరణి’ పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత
ధ‌ర‌ణి పోర్టల్ నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను ఎన్​ఐసీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వ‌ర‌కు టెరాసిస్ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ధ‌ర‌ణి పోర్టల్ నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్ సెంట‌ర్‌- ఎన్​ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 

మూడేళ్ల పాటు నిర్వహ‌ణ‌కు ఎన్​ఐసీతో ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్​ఐసీ ప‌నితీరు బాగుంటే మరో రెండేళ్లు నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను పొడిగించ‌నున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి అప్పగించ‌డం ద్వారా దాదాపు కోటి రూపాయ‌ల నిర్వహ‌ణ భారం కూడా త‌గ్గుతుంద‌ని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 

అయితే ధ‌ర‌ణి పోర్టల్‌కు చెందిన సాంకేతిక అంశాల‌ను పూర్తి స్థాయిలో ఎన్ఐసీకి బ‌ద‌లాయించేందుకు న‌వంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు టెరాసిస్ సంస్థ సిబ్బంది ఎన్ఐసీకి స‌హ‌క‌రిస్తార‌ని కూడా రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్రట‌ర్ న‌వీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ధరణి పోర్టల్‌ స్థానంలో భూ మాత పేరుతో పోర్టల్‌ ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. 

ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ ఎన్‌ఐసీకి బదలాయింపు ప్రక్రియను సర్కార్‌ ఇటీవల పూర్తిచేసింది. ఇక పేరు మార్పు మారిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ధరణి పోర్టలల్‌లో ఉన్న పెండింగ్‌ దరఖాస్తుల స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా దాదాపు పరిష్కరించారు. కొత్త చట్టంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన దరఖాస్తులే మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం.