ఐసిస్ ఉగ్రవాదులు పిల్లల మాంసాన్ని తినిపించారు

ఐసిస్ ఉగ్రవాదులు పిల్లల మాంసాన్ని తినిపించారు
‘దశాబ్దాల తరబడి మమ్మల్ని బందీలుగా ఉంచారు. అసలు వెలుతురన్నదే లేకుండా చీకటి గృహాల్లో ఉంచేవారు. అనేకసార్లు అత్యాచారాలు చేశారు. రోజుల తరబడి తిండిపెట్టకుండా మాడ్చేవారు. మా పిల్లలను చంపి వారి మాంసాన్ని మాకు భోజనంలో వడ్డించే వారు’ అంటూ ఐసిస్‌ బందీగా ఉంటూ విడుదలైన ఒక మహిళ వారి అరాచకాల గురించి వెల్లడించింది.
 
ఐసిస్ ఉగ్రవాదులు పదేళ్ల కిందట అంటే 2014లో ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను అపహరించారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్ళు.  గాజాలో కొన్నేండ్లుగా ఐసిస్‌ బందీగా ఉన్న ఆమెను ఇటీవలే ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌), యూఎస్‌ ఎంబసీలు రక్షించాయి. బందీగా ఉన్న కాలంలో తాను పడిన చిత్రహింసల గురించి ఆమె ఒక బ్రిటిష్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌కు వివరించింది. 
 
ఉత్తర ఇరాక్‌లోని సింజార్‌ ప్రాంతానికి చెందిన ఈ యజిదీ మహిళకు 11 ఏండ్ల వయసున్నప్పుడు దశాబ్దం క్రితం ఐసిస్‌ ఉగ్రవాదులు అపహరించారు. ఉగ్రవాదులు తాము హతమార్చిన యజిదీ శిశువుల మాంసాన్ని వండి తమకు పెట్టేవారని ఆమె తెలిపింది. బందీగా ఉన్న ఒక మహిళ భోజనం చేసే సమయంలో తనకు వడ్డించిన మాంసం తన కుమారుడిదేనని తెలిసి తీవ్రంగా రోదించి గుండెపోటుతో మరణించిందని చెప్పారు.
 
శిశువులను చంపి వారి మాంసాన్ని వండి తినమనేవారని, తిన్న తర్వాత మీరు వీరి మాంసమే తిన్నారంటూ తలలు నరికిన శిశువుల ఫొటోలు చూపేవారని తెలిపింది. అయితే తింటున్నప్పుడు వాసన తేడాగా ఉన్నట్టు తెలిసినా ఆకలితో ఉండటం వల్ల అలాగే తినే వారమని, అది తిన్న తర్వాత కడుపు నొప్పితో పాటు పలుమార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యామని తెలిపింది. 
 
నిస్సహాయ స్థితిలో తాము ఏమీ చేయలేకపోయేవారమని పేర్కొంది. తాము బందీగా ఉన్నంత కాలం చీకట్లోనే ఉంచారని, సూర్యకాంతిని ఎప్పుడూ చూడలేదని తెలిపింది. తాగడానికి మురికినీరు ఇచ్చేవారని, అది తాగి చాలామంది పిల్లలు మరణించారని చెప్పింది. ఎవరైనా బాలికలు నచ్చితే తమ వెంట తీసుకుపోయేవారని పేర్కొన్నది.
 
ఐసిస్‌ ఉగ్రవాదులు అమ్మాయిల అక్రమ రవాణా, సెక్స్‌ వ్యాపారం కూడా చేసేవారని, తనకు 15 ఏండ్ల సమయంలో పలుసార్లు అత్యాచారం చేశారని, ఐదు సార్లు తనను అమ్మడం, కొనడం చేశారని తెలిపింది. తనకు పలుసార్లు డ్రగ్స్‌ కూడా ఇచ్చారని ఫౌజియా వెల్లడించింది.

ఉగ్రవాద సంస్థకు చెందినవారు తమకు మానవ మాంసాన్ని తినిపించారని చెప్పినప్పుడు, అక్కడ చాలా మంది షాక్ కు గురయ్యారని సిడో చెప్పారు.  మరో 200 మంది యాజిదీ అమ్మాయిలతో పాటు బేస్ మెంట్ జైలులో సిడోను కొన్ని నెలలు నిర్బంధించారు.   కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ సైన్యం నేతృత్వంలోని సైనిక చర్యలో గాజా నుంచి ఆమెను రక్షించారు. దీంతో ఆమె తన కుటుంబం ఉన్న ఇరాక్‌కు తిరిగి రాగలిగింది.

తాను వారి చెరలో ఉన్నంత కాలం సబయా అనే పేరుతో జిహాదీలకు విక్రయించినట్టుగా సిడో చెప్పారు. సబయా అనేది అరబిక్ పదం. అంటే లైంగిక దోపిడీ కోసం బందీగా ఉన్న మహిళ అని అర్థం. గాజాలో నరకంలా బతికానని, స్వస్థలమైన ఇరాక్ చేరుకున్నప్పుడు స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలిగానని సిడో తన బాధను చెప్పుకొచ్చారు.