లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి

లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి
* పోలీసుల వ్యవహారంపై వి హెచ్ పి ఆగ్రహం
 
తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పరిపాలన కొనసాగుతోందని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ దేవి దేవతలకు రక్షణ కరువైపోయిందని విమర్శించింది. తమ ఆరాధ్య దైవానికి జరిగిన అపరాధాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యంత పాశువికంగా వ్యవహరించడం అప్రజాస్వామీకమని పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బి.  నరసింహమూర్తి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్శివరాములు విమర్శించారు. 
 
ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బజరంగ్దళ్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. ఉగ్రవాదులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హిందువులపై దాడులు చేయడం వారి అసమర్ధతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. 
 
భాగ్యనగరంలో హిందువుల మనోభావాలు గాయపరుస్తూ వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే అరికట్టాల్సిన పోలీసుల ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించడం అలవాటుగా మారిందని విమర్శించారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను మతిస్థిమితం లేని వారిగా చిత్రీకరించి, దాడులను మరింత ప్రేరేపించే విధంగా వ్యవహరించడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు స్పష్టం చేశారు. 
 
ముత్యాలమ్మ తల్లి విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అయినటువంటి  ఉగ్రవాది ముజఫర్ జామను పట్టుకోవడంలో విఫలమైనటువంటి పోలీసులు శనివారం హిందువుల  సహనాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించడం దుర్మార్గమని వారు మండిపడ్డారు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలు శిక్షణ పొందిన వాళ్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, భక్తులపై లాఠీ చార్జి చేసి హిందువులను భయభ్రాంతులకు గురిచేయడం గర్హనీయమని పేర్కొన్నారు. 
 
పోలీసులు తమ శక్తిని ఉపయోగించి ఉగ్రవాద శిక్షణ పొందిన 150 మందిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం పోలీసుల పనితనానికి నిదర్శనంగా చెప్పవచ్చని ఎద్దేవా చేశారు. లాటి,తూటాలతో  భయభ్రాంతులకు గురి చేస్తామంటే  హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని పరిషత్, భజరంగ్ దళ్ నేతలు  హెచ్చరించారు. 
 
శనివారం సికింద్రాబాద్ లో లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. దేవాలయాలపై వరుస దాడులు నేపథ్యంలో దోషులను గుర్తించి, వెంబడే కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.