అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెరుగుతున్న అనిశ్చిత

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెరుగుతున్న అనిశ్చిత

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ నవంబరు 5 దగ్గర పడుతుండగా ఫలితాలపై అనిశ్చిత కొనసాగుతుంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు హోరాహోరీగా పోటీ పడుతుండగా గెలుపోటములపై ఎవ్వరికీ వారు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నది.

ట్రంప్‌ కన్నా హారిస్‌ ఆధిక్యతను కొనసాగిస్తున్నారని తాజాగా నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది. కానీ అనూహ్యమైన రీతిలో తానే గెలుస్తానంటూ తనకు అనుకూలంగా వున్న అంశాలను రిపబ్లికన్‌ అభ్యర్ధి ట్రంప్‌ పేర్కొంటున్నారు. సెప్టెంబరు 29, అక్టోబరు 6 మధ్య జరిగిన న్యూయార్క్‌ టైమ్స్‌, సియనా కాలేజ్‌ పోల్‌లో కమలా హారిస్‌కు 49, ట్రంప్‌కు 46 శాతం ఓట్లు లభించాయి.

ఈ పోల్‌లో 3,385మంది ఓటర్లు పాల్గొన్నారు. మార్పును తీసుకువచ్చే అభ్యర్ధిగా హారిస్‌ను యువ ఓటర్లు చూస్తున్నారు. యువత వరకు చూసినట్లైతే అభ్యర్ధులిద్దరి మధ్య తేడా 58 శాతం, 34శాతంగా వుంది. అదే పురుష ఓటర్లకు సంబంధించి పరిశీలిస్తే ట్రంప్‌ 11పాయింట్లతో ఆధిక్యతలో వున్నారు.  అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రధానంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీన్ని సక్రమంగా చక్కదిద్దగలిగే సమర్ధత ట్రంప్‌కే వుందని హారిస్‌కు లేదని ఎక్కువమంది ఓటర్లు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

మరోవైపు నమోదైన ఓటర్లలో, ఆఫ్రికన్‌ వారసత్వం కలిగిన పౌరుల్లో మెజారిటీ ప్రజలు కమలా హారిస్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆమె కచ్చితంగా మరింత మెరుగైన రీతిలో మార్పు తీసుకువస్తుందని విశ్వసించలేకపోతున్నారని ఎపి-ఎన్‌ఓఆర్‌సి సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రీసెర్చ్‌ పోల్‌ వెల్లడించింది. కీలకమైన రాష్ట్రాలు, ఊగిసలాట ఎక్కువగా వుండే రాష్ట్రాలు అంతిమంగా ఈ పోరును నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. చివరి వారాల్లో అభ్యర్ధుల కార్యాచరణే ప్రధానంగా కూడా ఉండనుంది.