రెండు రోజుల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులు

రెండు రోజుల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులు

దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా ఏడు విమానాలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో భద్రతా సంస్థలు, ఉగ్రవాద నిరోధక డ్రిల్స్​ను నిర్వహించారు.

ఈ బాంబు బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకల్లోనూ ఆలస్యం, షెడ్యూల్లో మార్పులు జరికాయి. మదురై – సింగపూర్‌, డిల్లీ – షికాగో, జైపుర్‌ – బెంగళూరు, సహా ఏడు విమానాలకు గంటల వ్యవధిలోనే ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఈ విమానయాన సంస్థల సిబ్బంది సహా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కలకలం రేపడంతో అప్రమత్తమైన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) – సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫిర్యాదు​ చేసింది. అనంతరం సంబంధిత ఎక్స్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ బాంబు బెదిరింపులు రావడంతో కొన్ని విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ కూడా అయ్యాయి.

“డెహ్రాదూన్‌ నుంచి బయలు దేరిన మా విమానంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విమానానికి భద్రతా ముప్పు పొంచి ఉందని ఆన్‌లైన్‌లో పోస్ట్​ కనిపించింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన మా ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండింగ్‌ చేసింది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి బాంబు స్క్వాడ్‌ వారికి సమాచారం ఇచ్చాం.” అని స్పైస్‌జెట్​కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

 సోమవారం కూడా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబయి నుంచి న్యూయార్క్‌కు బయలు దేరిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతకు ముందుకు మస్కట్‌, జెడ్డాకు వెళ్లాల్సిన విమానాలకు ఇదే జరిగింది. అలా రెండు రోజుల వ్యవధిలోనే 10 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

అయితే ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు నిర్వహించిన ఇన్​వెస్టిగేషన్​లో ఆ బెదిరింపులన్నీ బూటకమని తేలినట్లు సమాచారం అందుతోంది. బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని కెనడాకు మళ్లించి ఇక్లూయిట్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ అన్నీ ఫేక్ అని తేలినప్పటికీ బాధ్యతాయుతమైన ఎయిర్ లైన్స్ ఆపరేటర్ గా అన్ని బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా చింతిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది.

ఈ నకిలీ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న వారిని గుర్తించడానికి ఏజెన్సీలకు అన్ని విధాలా సహకరిస్తున్నామని ఎయిరిండియా తన ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థకు జరిగిన నష్టాన్ని రికవరీ చేయడానికి బాధ్యులపై చట్టపరమైన చర్యలను కూడా పరిశీలిస్తామని తెలిపింది