బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఘర్షణ

బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఘర్షణ
* ఒక యువకుడి మృతి
ఉత్తరప్రదేశ్‌ లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుని బంధువులతో పాటు వేలాది వందలాది నిరసనకారులు మృతదేహాన్ని తీసుకుని మహిసి తహసిల్ కార్యాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
 పలువురు ఆందోళన కారులు ఒక ప్రైవైటు ఆసుపత్రి, ద్విచక్రవాహనాల దుకాణంతో సహా పలు ఆస్తులకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసు బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం సందర్భంగా మహసీ ప్రాంతం మీదుగా ఊరేగింపు సాగింది.
పెద్దగా మ్యూజిక్‌ ప్లే చేయడంపై ఒక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు జరిపారు. 22 ఏళ్ల హిందూ యువకుడు మరణించగా పలువురు గాయపడ్డారు.

దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ అల్లర్ల నేపథ్యంలో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం నిలిచిపోయింది.  కాల్పులు జరిపి వ్యక్తిని సల్మాన్‌గా గుర్తించి అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడినట్టు చెబుతున్న 30 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో మహసీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు హోం ఏసీఎస్, శాంతి భద్రతల ఏడీజీ ఘటనా స్థలికి చేరుకున్నట్టు బహ్రాయిచ్ ఎస్‌పీ వ్రిందా శుక్లా తెలిపారు.  దుర్గా నిమజ్జనం సందర్భంగా చెలరేగిన హింసను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు.

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అల్లర్లను రెచ్చగొట్టే వాళ్లను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు అధికారులను ఆదేశించారు. విగ్రహ నిమజ్జనాలు కొనసాగాల్సిందేనని, సకాలంలో విగ్రహాలు నిమజ్జనం చేయాల్సిందిగా రెలిజియస్ ఆర్గనేజేషన్లకు సమాచారం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.

పూర్తి బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోనికి తెచ్చామని చెప్పారు. కాగా, మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ నచ్చచెప్పి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు వారు అంగీకరించారు.

బహ్రాయిచ్ హింసాకాండను ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలకు భంగం కలిగించే ఎలాంటి కుట్రలను సహించేది లేదన్నారు. అల్లరిమూకలకు రక్షణ కల్పిస్తూ వస్తున్న కొందరు తిరిగి చురుకుగా పనిచేస్తున్నారని, వారి పట్ల అత్యంత అప్రమత్తంగా, పూర్తి నిఘా వేసి ఉంచామని చెప్పారు.