మూసీ ప్రక్షాళన పేరిట కూల్చివేతలకు రేవంత్‌రెడ్డి సర్కార్ సిద్దంకాగా, మూసీ పరీవాహక ప్రజలు తమ ఇండ్లను కూల్చవద్దంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రేపోమాపో రెండో దఫా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కోర్టుల ద్వారా స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. మూసీ అభివృద్ధి పేరిట ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇండ్లను ఇప్పటికే రివర్ బెడ్ మార్కింగ్ చేసింది. వీటిని దశల వారీగా కూల్చనున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బుల్డోజర్లు తమ ఇంటిపైకి రాకముందే మూసీ పరీవాహక ప్రజలు తమ ఇండ్లకు కోర్టు ఆదేశాలను రక్షణ కవచంలా ఏర్పాటు చేసుకుంటున్నారు. తొలి దశలో మార్కింగ్ చేసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మలక్‌పేట నుంచి నాగోల్ వరకు మూసీ వెంబడి ఉన్న పలు కాలనీ వాసులు ఇండ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు.
ఫణిగిరి కాలనీల్లో దాదాపు 25 నిర్మాణాలకు కోర్టు ఆదేశాలను అతికించగా, కోర్టు విచారణలో ఉందనీ, కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని తెలుపుతూ నోటీసు బోర్డులను ఇండ్లకు అతికించారు. ఎలాంటి దిశానిర్దేశం, పారదర్శకత,ప్రణాళికలు లేకుండానే మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతున్నది. ఈ క్రమంలో రివర్ బెడ్, ఎఫ్‌ఆర్‌ఎల్ హద్దులను ఏ ప్రామాణికతతో గుర్తించి మార్కింగ్ చేశారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
ఈ క్రమంలో అన్ని అనుమతులతో ఎప్పుడో నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు అంగీకరించని యజమానులు కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వ దూకుడుకు ముకుతాడు వేస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీరివర్ బెడ్‌లోని ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఓ కార్యాచరణను సైతం రూపొందించింది. మరోవంక, హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా ఉపాధి పొందిన వారు బాధితులుగా మారుతున్నారు. అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ సంస్థలు బాగానే ఉన్నాయి. ఇన్నాళ్లు నివాసం ఉన్న ఇంటి యజమానులు బాగానే ఉన్నారు.
కానీ ఏజెంట్ల పరిస్థితి తలకిందులుగా మారింది. ఉపాధి కోసం రియల్ ఎస్టేట్‌లో భూములు, ఫ్లాట్లను విక్రయించే ఎంతో మంది ఏజెంట్లు బలిపీఠం ఎక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మ్యాపుల ప్రకారం చెరువుల హద్దులను నిర్ధారించడంతో ఎప్పుడో కట్టిన, డెవలప్ చేసిన వెంచర్లు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఇండ్లను ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ నోటీసులు అంటించడంతో యజమానులు బిల్డర్లతోపాటు, ఏజెంట్ల వెంటపడుతున్నారు.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన