* కెనడా రాయబారిని వెనక్కి పిలిపించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లుగా (అనుమానితులుగా) కెనడా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తలపైనా వేటు వేసింది. అక్టోబర్ 19 అర్ధరాత్రి 12 గంటల్లోపు ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు భారత్ విడిచి వెళ్లిపోవాలని సూచించింది.
అంతకు ముందే కెనడాలోని హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ట్రూడో సర్కారుపై తమకు విశ్వాసం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అక్కడి భారత రాయబారుల భద్రతపై అనుమానాలున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో కెనడాలోని రాయబారి, దౌత్య అధికారులను భారత్ వెనక్కి పిలిపించింది. ‘ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం చర్యలు భారత ధౌత్యాధికారుల భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నట్లు తెలుస్తున్నది. వారి భద్రతకు హామీ ఇవ్వడానికి ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వం నిబద్ధతపై మాకు విశ్వాసం లేదు. అందువల్ల హైకమిషనర్, లక్ష్యంగా ఉన్న దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో భారత రాయబారులపై కెనడా అభియోగాలు మోపింది. ఒట్టావాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్య అధికారులను ఈ కేసులో ‘ఆసక్తి ఉన్న వ్యక్తులు’గా ఆరోపించింది.
ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చర్యలను వ్యతిరేకిస్తూ భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు తాజాగా సమన్లు జారీ చేసింది. సోమవారం సాయంత్రం కెనడా వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిపించింది. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై నిరాధారమైన ఆరోపణలు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో ప్రభుత్వం ఇదంతా చేస్తోందని భరత్ ఆరోపించింది. తన భూభాగంపై ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని అణచివేయలేక కెనడా అర్థరహితమైన వాదనలు చేస్తోందని మండిపడింది. 2023లో ఆ దేశ ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్‌తో కెనడా పంచుకోలేదని విదేశాంగశాఖ వెల్లడించింది.
ఇప్పటికే తాము పలు మార్లు ఆ దేశ సర్కారును అభ్యర్థించామని వెల్లడించింది. రాజకీయ లబ్ధికోసమే తాజాగా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై కెనడా విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని ట్రూడో 2018 నుంచే భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. భారత్ లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారిని ఆయన తన మంత్రివర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేసింది. 2020లో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకొనే యత్నం చేశారని ఆరోపించింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని విదేశాంగశాఖ వెల్లడించింది.
ఆసియాన్ సమావేశాల సందర్భంగా లావోస్‌లో భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇరువురి మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని భారత్ స్పష్టంచేసింది. కేవలం వారిద్దరూ ఎదురుపడ్డారని భారత్ అధికారులు తెలిపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే వరకు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సాధారణస్థితికి చేరుకోవడం కష్టమని ఇటీవలే భారత్ పేర్కొంది.

More Stories
డిజైన్ లోపంతోనే స్లీపర్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు!
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం