మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

అధికారం ఉందన్న అహంతో నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మరి పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఎస్సైని నిలబెట్టి ఆ కుర్చీలో ఆమె కూర్చోవడంతో మరింత వివాదాస్పదంగా మారింది.

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఆదివారం వివాదం నెలకొంది. దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో కొండా సురేఖ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీని ధ్వంసం చేశారు.

దీంతో కోపోద్రేక్తులైన కొండా సురేఖ అనుచరులు రేవూరి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై రేవూరీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొండా సురేఖ వర్గానికి చెందిన ముగ్గుర్ని గీసుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆ ముగ్గుర్ని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌- నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ధర్నా చేశారు.

చివరకు సమస్యను పరిష్కరిస్తామని సీఐ మహేందర్‌ హామీ ఇవ్వడంతో కొండా అనుచరులు ధర్నాను విరమించుకున్నారు.  తన వర్గీయులైన ముగ్గుర్ని గీసుకొండ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె స్వయంగా గీసుకొండ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.  అక్కడ ఎస్సై కుర్చీలో కూర్చొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. మంత్రి వచ్చారని తెలియడంతో ఆమె అనుచరులు భారీగా స్టేషన్‌కు తరలివచ్చారు. విషయం సీరియస్‌ కావడంతో వరంగల్‌ సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా సీపీపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులపై డీఎస్పీ, సీఐ, ఎస్సైని వెంటనే రిలీవ్‌ చేయాలని వరంగల్‌ సీపీ అంబర్‌ కిశోర్‌ ఝాను ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ డిమాండ్‌ చేశారు.