రాహుల్ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేసు

రాహుల్ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేసు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై అలహాబాద్ హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్ కాపీ దాఖలుకు బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యవధి మంజూరు చేసింది. తాను పిటిషన్ నకలు పొందానని, ఈ విషయంలో అభ్యర్థనలు తన పిటిషన్ వాదనలకు భిన్నమైనవని స్వామి హైకోర్టుకు తెలియజేశారు. 

తమ గత ఉత్తర్వును పాటిస్తూ ఎలక్ట్రానిక్ రీతిలో డాక్యుమెంట్లు దాఖలు చేయవలసింని పిటిషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలాతో కూడిన ధర్మాసనం కోరి, తదుపరి విచారణకు ఆయన పిటిషన్‌ను నవంబర్ 6కు పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలని కోరుతూ తాను సమర్పించిన లేఖపై నిర్ణయం తీసుకోవలసిందిగా కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ)కు ఆదేశాలు జారీ చేయాలన్న స్వామి పిటిషన్‌ను బెంచ్ విచారిస్తున్నది. 

లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన లేఖపై స్టాటస్ నివేదికను సమర్పించవలసిందిగా ఎంహెచ్‌ఎను ఆదేశించాలని స్వామి తన పిటిషన్‌లో కోరారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వ్యవహారానికి తన కేసుతో సంబంధం లేదని, ఆ వాదనలు పూర్తిగా భిన్నమైనవని ఆదిలో స్వామి బెంచ్‌కు విన్నవించారు. ‘ఓకె, మేము చూస్తాం’ అని బెంచ్ చెప్పింది.