భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం

భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
* పరోక్షంగా చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ

 భారత్‌తో మాల్దీవుల ద్వైపాక్షిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, భారతదేశ భద్రతను దెబ్బతీసేలా తమ దేశం వ్యవహరించదని, అనేక రంగాలలో సహకారంతో న్యూఢిల్లీని ‘విలువైన భాగస్వామి, స్నేహితుడు’గా చూస్తుందని  ఐదు రోజుల పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ స్పష్టం చేశారు. చైనాకు సన్నిహితుడిగా, భారత్ కు వ్యతిరేకిగా పేరొందిన ఆయన పరోక్షంగా తమ దేశ విధానాలపై చైనాను హెచ్చరించినట్లయింది.

జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనప్పటికీ, భారత్‌లో ఆయన తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటనకై వచ్చారు. ఢిల్లీతో పాటు ముంబై, బెంగుళూరులను కూడా సందర్శించి అక్కడ వ్యాపాడార కార్యక్రమాలకు హాజరు కానున్నారు. “భారతదేశం భద్రతను అణగదొక్కడానికి మాల్దీవులు ఎన్నటికీ ఏమీ చేయదు. మేము వివిధ రంగాలలో ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకుంటూనే, మా చర్యలు మా ప్రాంతం భద్రత,  స్థిరత్వం విషయంలో రాజీ పడకుండా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నాము…” అని ఆయన తేల్చి చెప్పారు.

ఆదివారం భారత్ కు వచ్చిన మొయిజ్జుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సోమవారం మొహమ్మద్ మొయిజ్జు భారత దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,ముయిజ్జుల సమావేశం జరిగింది.

సమావేశం అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులలో పర్యటించే వారిలో భారతీయులే అధికం కావడంతో వీరి సమావేశంలో టూరిజం అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తుంటారని, భవిష్యత్తులో మరింత మంది సందర్శిస్తారని కోరుకుంటున్నానని మొయిజ్జు చెప్పారు.

‘మాల్దీవులకు అవసరం వచ్చిన ప్రతిసారి భారత్ వెన్నంటి ఉంది. స్నేహ హస్తం అందిస్తోంది. అలాగే తమ దేశ ఆర్థికాభివృద్ధిలో భారత్‌ది ఎంతో కీలక పాత్ర’ అని మాల్దీవులు అధ్యక్షుడు కొనియాడారు. ఏళ్ల తరబడి మాల్దీవులకు అండగా నిలుస్తోన్న ప్రధాని మోదీతోపాటు భారతీయులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ  భారత్, మాల్జీవుల బంధం వందల ఏళ్ల నాటిదని తెలిపారు. అయితే గతంలో మొయిజ్జు చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో చేసిన సానుకూల వ్యాఖ్యలతో ఒక రకంగా భారత్, మాల్దీవుల మధ్య గత 10 నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. గతంలో భారత ప్రధానిని, భారత్‌ని తక్కువ చేస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.

దాంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి ఆ ప్రాంతంలోని అందాల గురించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో భారతీయ టూరిస్టులను మాల్దీవ్స్ వెళ్లకుండా లక్షద్వీప్ వైపు మళ్లించే యోచనలోనే ప్రధాని మోదీ అక్కడ పర్యటించారనే అభిప్రాయం వ్యక్తమైంది.

 అంతేకాదు భారత్ వైపు నుంచి ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అనే నినాదం కూడా వైరల్ అయింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ తాజాగా మొయిజ్జు మాట్లాడిన తీరు ఆ పరిస్థితిని మార్చేసింది. అధికారంలోకి రాగానే, తమ దేశంలోని భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా ఢిల్లీ బయలుదేరే ముందు బీబీసీతో మాట్లాడిన ముయిజ్జు.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాల్దీవులకు భారత్‌ అండగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

కాగా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుతో చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జును భారత్‌కు రావడాన్ని నేను స్వాగతిస్తున్నా. వాతావరణ మార్పు, నీటి వనరులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఇరు దేశాలకు చెందిన కొన్ని రంగాలలో ఆర్థిక సంబంధాలు, కనెక్టివిటీ, సాంస్కృతిక అనుసంధానం, సహకారాన్ని మెరుగుపరచడానికి గల మార్గాలను ఈ సమావేశంలో చర్చించాం”అని మోదీ పేర్కొన్నారు. 

మాల్దీవుల్లో పర్యటించాల్సిందిగా మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.