ఈడీ విచారణకు కాంగ్రెస్‌ నేత అజారుద్దీన్‌

ఈడీ విచారణకు కాంగ్రెస్‌ నేత అజారుద్దీన్‌
తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వరింగ్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.

2019 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి తోడు ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ అక్రమాలపై ఏసీబీ అధికారులు సైతం పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్‌ నమోదు చేశారు. అజారుద్దీన్‌ పదవీకాలంలో క్రికెట్‌ బాల్స్‌, బకెట్‌ చైర్స్‌, జిమ్‌ పరికరాలకు కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

గతంలోనే హెచ్‌సీఏలో అక్రమాలపై ఈడీ నజర్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో హెచ్‌సీఏలోని అక్రమాలపై విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. కాగా ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్‌, శివలాల్‌ యాదవ్‌ను గత డిసెంబర్‌లో ఈడీ అధికారులు విచారించారు.

ఇదే రూ.20 కోట్ల అంశానికి సంబంధించి హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ అధికారులు గత డిసెంబర్‌లో నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఈడీ ఎదుట హాజరుకావాలని వినోద్‌కు నోటీసులు పంపి, విచారించారు. ఉప్పల్‌ స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేశారని, అవినీతి నిరోధక శాఖ మూడు కేసులు నమోదు చేసింది. 

ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్‌ చట్టం కింద మరో కేసును నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇదే వ్యవహారంలో గత నవంబర్‌లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు, రూ.10,39,000ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.