ఉత్కంఠ పోరులో పాక్ పై భార‌త్ జ‌య‌కేత‌నం

ఉత్కంఠ పోరులో పాక్ పై భార‌త్ జ‌య‌కేత‌నం
* మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో
 
మహిళల టీ20 ప్రపంచకప్‍లో భారత్ బోణి కొట్టింది. పాకిస్థాన్‍తో కీలకమైన హైవోల్టేజ్ మ్యాచ్‍లో విజయం సాధించింది. మెగాటోర్నీలో తొలుత న్యూజిలాండ్‍ చేతిలో ఓడిన టీమిండియా.. పాక్‍పై గెలుపుతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. దుబాయ్ వేదికగా నేడు (అక్టోబర్ 6) జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏ మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై 6 వికెట్ల తేడాతో హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ గెలిచింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..

ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‍కు దిగింది పాకిస్థాన్. భారత బౌలర్లు ఆరంభం నుంచే అదరగొట్టారు. పాక్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తూ వికెట్లు రాబట్టారు. 20 ఓవర్లలో పాకిస్థాన్ 8 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిదా దార్ (28) మినహా మిగిలిన పాక్ బ్యాటర్లు రాణించలేకపోయారు.

టీమిండియా బౌలర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లతో అదరగొట్టారు. పాక్ బ్యాటింగ్ లైనప్‍ను దెబ్బకొట్టారు. శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసుకున్నారు. రేణుక సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలా ఓ వికెట్ తీసుకున్నారు. తొలి ఓవర్లోనే గుల్ ఫెరోజాను రేణుక సింగ్ ఔట్ చేశారు. ఆ తర్వాత కూడా పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. నిదా దార్ ఒక్కరే కాసేపు నిలకడగా ఆడినా.. వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో 105 పరుగులకే పాక్ పరిమితమైంది.

106 స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ కాస్త ఆచితూచి ఆడింది. గెలిచేందుకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ దూకుడు చూపలేదు. దీంతో 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసి విజయం సాధించింది భారత్. తక్కువ టార్గెట్ అయినా 7 బంతులు మిగిల్చి మాత్రమే గెలిచింది. టీమిండియా యంగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (35 బంతుల్లో 32 పరుగులు; 3 ఫోర్లు) నిలకడగా ఆడారు. స్మతి మంధాన (7) త్వరగానే ఔటయ్యారు.

షెఫాలీ 11వ ఓవర్లో వెనుదిరిగారు. జెమీమా రోడ్రిగ్స్ (23), కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్   (29) క్రమంగా పరుగులు చేస్తూ జట్టును విజయం దిశగా ముందుకు నడిపారు. హిట్టింగ్‍కు పోలేదు. రోడ్రిగ్స్ 16వ ఓవర్లో ఔట్ కాగా.. హర్మన్ రిటైర్డ్ హర్ట్ అయ్యారు. రిచా ఘోష్ డకౌట్ అవడంతో కాస్త టెన్షన్ రేగింది. దీప్తి శర్మ (7 నాటౌట్), సజీవన్ సంజన (4 నాటౌట్) భారత్‍ను గెలుపు తీరం దాటించారు.

మహిళల టి20 ప్రపంచకప్తొలి మ్యాచ్‍లో న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 58 పరుగులతో ఓడి భారత్ నిరాశపరిచింది. నేడు పాకిస్థాన్‍తో గెలిచి బోణి చేసింది. దీంతో గ్రూప్-ఏలో పాయింట్ల ఖాతా తెరిచింది టీమిండియా. ఐదు జట్లు ఉన్న ఈ గ్రూప్‍లో నాలుగో ప్లేస్‍లో ఉంది. ఈ టోర్నీలో తదుపరి శ్రీలంక (అక్టోబర్ 9), ఆస్ట్రేలియా (అక్టోబర్ 13)తో భారత్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‍ల్లో భారీ తేడాతో గెలిస్తే టీమిండియాకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.