తుది దశకు చేరుకున్న వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం

తుది దశకు చేరుకున్న వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం

మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని చెబుతూ మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా  రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.  దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సోమవారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలో 2026 మార్చి నాటికి దేశం ఆ స‌మ‌స్య నుంచి విముక్తి కానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  గ‌డిచిన 30 ఏళ్ల‌లో తొలిసారి ఇండియాలో వామ‌ప‌క్ష తీవ్రవాద హింస వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 100 క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోయింద‌ని, ఇది పెద్ద విజయమని స్పష్టం చేశారు.

గ‌డిచిన ప‌దేళ్ల‌లో సుమారు 13000 మంది లెఫ్ట్‌వింగ్ తీవ్ర‌వాదులు త‌మ ఆయుధాల‌ను స‌రెండ‌ర్ చేసి, జ‌న‌జీవ‌న స్ర్ర‌వంతిలో క‌లిసిన‌ట్లు వెల్ల‌డించారు. ఇంకా మావో యుద్ధం చేస్తున్న యువ‌త త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌ను స‌రెండ‌ర్ చేయాల‌ని షా విజ్ఞప్తిచేశారు. కేంద్రం అందిస్తున్న పున‌రావాస ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందాల‌ని ఆయ‌న కోరారు. న‌క్స‌ల్స్ హిం ఎన్న‌టికీ, ఎప్ప‌టికీ ఎవ‌రికీ సాయం చేయ‌ద‌ని స్పష్టం చేశారు.

ప్ర‌స్తుతం 80 శాతం న‌క్స‌ల్స్ కేడ‌ర్ చ‌త్తీస్‌ఘ‌డ్‌లో మాత్ర‌మే ఉన్న‌ద‌ని, వామ‌ప‌క్ష తీవ్ర‌వాదంపై తుది స‌మ‌రం చేప‌ట్టే ద‌శ ఆస‌న్న‌మైన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ‘మెరుగైన భద్రతా పరిస్థితులు కల్పించడం వల్ల గత లోక్​సభ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 70 శాతం వరకు అధికంగా ఓటింగ్ నమోదయ్యింది. రక్షణ కార్యకలాపాలు నిర్వహించే భద్రతా దళాలు ఇప్పుడు ప్రమాదకర ఆపరేషన్స్ చేపడుతున్నాయి’ అని అమిత్ షా తెలిపారు.

“ఎనిమిది కోట్ల ప్రజల అభివృద్ధి, ప్రాథమిక సంక్షేమ అవకాశాలను హరించే అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు వారే. మోదీ ప్రభుత్వ వ్యూహం వల్లే మావోస్టుల తీవ్రవాదం హింస 72 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 202 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరో 723 మంది లొంగిపోయారు. 13వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారు” అని హోంమంత్రి తెలిపారు.

ఇక ఛత్తీస్‌గఢ్‌ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందని చెబుతూ అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టిపెట్టి, భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలని అమిత్​ షా పిలుపునిచ్చారు.  సమాజంలో అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. దేశాభివృద్ధికి వారే అతి పెద్ద అడ్డంకి అని పేర్కొన్నారు. వాళ్లపై భద్రతా దళాలు ప్రమాదకరమైన ఆపరేషన్లు నిర్వహించి పెద్ద విజయాన్ని సాధించాయని ఆయన కొనియాడారు.

‘హింసాత్మక ఘటనలు 16,463 నుంచి 7700కు తగ్గాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. 2010తో పోలిస్తే పౌరులు, భద్రతా దళాల మరణాలు 70 శాతం తగ్గాయి. హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. పదేళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్‌ నెట్‌వర్క్‌తో పాటు 15,300 సెల్‌ఫోన్‌ టవర్లను ఏర్పాటు చేశాం. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం’ అని అమిత్​ షా వెల్లడించారు.

మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంతోపాటు పోలీస్ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా బాగా పనిచేశాయని ఆయన ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే వికసిత భారత్ సాధించాలంటే గిరిజనులు, ఆదివాసీలు సైతం అందులో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు.

కానీ ప్రభుత్వ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రహదారులు, టవర్లు, చివరకు విద్య, వైద్యం సైతం వీరికి చేరనివ్వడం లేదని చెప్పారు. అయితే గత కొన్నేళ్లుగా మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కార్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు.

మావోయిస్టుల సమస్యను అధిగమించేందుకు బహుముఖ వ్యూహాన్ని సైతం అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఈ సమస్యను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు సైతం చాలా బాగా పని చేస్తున్నాయని ప్రశంసించారు. ఇక ఎన్‌కౌంటర్‌లలో గాయపడిన భద్రత బలగాలను త్వరితగతిన వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగిస్తున్నామని గుర్తు చేశారు.