జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు నిలిపివేత!

జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు  నిలిపివేత!
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించిన షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. 2022 సంవత్సరానికి గానూ తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు (తిరుచిట్రంబలం) సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్‎గా జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించింది.
 
కాగా అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే రిమాండ్ ఖైదీగా చంచల్ గూడా జైలులో ఉన్న జానీ మాస్టర్‌ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ గురువారం  తీర్పు ఇచ్చింది. 
 
దీంతో అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ సిద్ధం అవుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఊహించని షాక్ ఇచ్చింది. నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటికిరావటంతో  ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయనపై పోక్సో కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించిన నేపథ్యంలో జానీమాస్టర్‌కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
2020 నుంచి తనపై జానీ మాస్టర్ చాలాసార్లు అనేక ప్రదేశాల్లో లైంగిక దాడి చేశారని ఆయన వద్దే పని చేసే 21ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులకు కంప్లైట్ చేశారు. తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి దురాగతం చేశారని పేర్కొన్నారు. దీంతో జానీపై పోక్సో కేసు కూడా నమోదైంది. 
 
ఇంట్లో, ఔట్‍డోర్ షూటింగ్‍ల్లో ఇలా చాలాసార్లు తనపై వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు.  కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్టు  సమాచారం రావటంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు.
సెప్టెంబర్ 20న జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.  ఈ కేసులో జానీకి 14 రోజుల రిమాండు విధించింది కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను నేరుగా చంచల్ గూడా జైలుకు తరలించారు. అనంతరం జానీ మాస్టర్‌ను విచారించేందుకు పోలీసులకు నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించటంతో తమదైన శైలిలో విచారణ జరిపారు.  
 
జాతీయ స్థాయిలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయిన జానీ మాస్టర్ కెరీర్‌పై ఈ కేసులతో నీలినీడలు కమ్ముకున్నాయి. రెగ్యులర్ బెయిల్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. తీవ్రమైన ఆరోపణలు ఉండటం ఆయనకు ప్రతికూలంగా ఉంది. ఇప్పుడు జాతీయ అవార్డు కూడా రద్దవడంతో జానీకి మరింత ఎదురుదెబ్బ తలిగింది.
 
కాగా ఈ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడు జానీ మాస్టర్. ఆ బాధిత యువతే తనను వేధించిందని కస్టడీలో ఆసక్తికర విషయాలను జానీ వెల్లడించినట్టు సమాచారం. స్వయంగా ఆ అమ్మాయే వచ్చి తనకు తానుగా పరిచయం చేసుకుందని, ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బంది పెట్టిందని తెలిపినట్టు సమాచారం.
 
వీళ్ల పంచాయితీ డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి కూడా వెళ్లిందని, ఆయన చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదంటూ విస్తుపోయే విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. ఇంతకీ అసలు నిజంగా అక్కడ జరిగిందేంటన్నది ఇప్పుడు అంతుచిక్కని విషయం.
 
మరోవంక, అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవాల్సింది. అయితే, ఆయన అవార్డు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో మధ్యంతర బెయిల్ కూడా అనిశ్చితిలో పడింది. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఇచ్చిన ఆ బెయిల్‍ను న్యాయస్థానం రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జానీకి ఇది మరింత ఎదురుదెబ్బగా ఉండనుంది.