2050 నాటికి అగ్రరాజ్యాలుగా భారత్, అమెరికా, చైనా

2050 నాటికి అగ్రరాజ్యాలుగా భారత్, అమెరికా, చైనా

2050 నాటికి భారత్, అమెరికా, చైనా ఆధిపత్యం వహించే అగ్ర రాజ్యాలుగా అవతరిస్తాయని, దీనితో ‘సంక్లిష్ట ప్రపంచ వ్యవస్థ’ నెలకొంటుందని, ఆ వ్యవస్థలో వ్యవహరించేందుకు ప్రపంచ నేతలు సిద్ధం కావాలని యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సూచించారు. 71 ఏళ్ల బ్లెయిర్ ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’కు ఇంటర్వూ ఇస్తూ, ఆ మూడు దేశాలతో రూపుదిద్దుకునే బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు దేశాలు అలవాటు పడవలసిన అవసరం ఉంటుందని చెప్పారు. 

‘ప్రపంచంలో మీ దేశం ఏ వైపు ఉండాలో మీరు నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అది బహుళ ధ్రువ ప్రపంచం కాబోతున్నది’ అని ఆయన సూచించారు. ‘ఈ శతాబ్దం మధ్యభాగానికి మూడు అగ్ర రాజ్యాలుగా అమెరికా, చైనా, బహుశా భారత్ ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.

తాను పదవిలో ఉన్న సమయంలో అమెరికా ఆధిపత్యం ఉన్న అగ్ర రాజ్యం అని, అప్పటి కన్నా ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారిందని 1997 నుంచి 2007 వరకు బ్రిటిష్ ప్రధానిగా ఉన్న బ్లెయిర్ చెప్పారు. చైనా, భారత్ ఉత్థానం భౌగోళిక రాజకీయాలను తిరిగి రూపుదిద్దుతున్నాయని, కూటములను, దౌత్యపరమైన వ్యూహాలని తిరిగి మదింపు వేయవలసిన అవసరం కనిపిస్తున్నదని ఆయన చెప్పారు.

`ఒకింత సమాన స్థాయిలో ఆ మూడు అగ్రరాజ్యాలతో మీరు చర్చలు జరపడానికి వీలుగా బలమైన కూటములను నిర్మించుకోవలసి ఉంటుంది’ అని బ్లెయిర్ తెలిపారు, మధ్య ప్రాచ్యంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్, హెజ్బొల్లా తీవ్రవాదుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, విస్తృత సంఘర్షణ ముప్పు గురించి కూడా బ్లెయిర్ మాట్లాడారు.

‘అది చాఆ ప్రమాదకర పరిస్థితి. మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ప్రస్తుత సంఘర్షణలే అందుకు కారణం’ అని బ్లెయిర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొనడానికి రెండు దేశాల పరిష్కార సూత్రానికి తాను మద్దతు ఇస్తున్నానని బ్లెయిర్ పునరుద్ఘాటించారు.  శాంతి చర్చలలో చైనా కీలక పాత్ర వహించే అవకాశం ఉందని చెబుతూ, ఈ విషయంలో తన మిత్రదేశమైన ఇరాన్ ను చైనా కట్టడి చేయాలని హితవు చెప్పారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడిలో ఇరాన్ పాత్ర ఉందని ఆయన స్పష్టం చేశారు.