గాజా హమాస్ అప్రకటిత ప్రధాని ముష్తాహాను చంపేశాం

గాజా హమాస్ అప్రకటిత ప్రధాని ముష్తాహాను చంపేశాం

హమాస్ కీలక నాయకత్వాన్ని అంతం చేసినట్లు ఇజ్రాయెల్ తాజా ప్రకటించింది. గాజా హమాస్ తరపున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహాను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. మూడు నెలల క్రితం జరిపిన వైమానిక దాడిలో ముస్తాహా సహా ముగ్గురు కమాండర్లు హతమయ్యారంటూ వారి ఫొటోలు, వివరాలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించింది

ముస్తాహాను లక్ష్యంగా చేసుకుని ఐడీఎప్ దళాలు మూడు నెలల క్రితం గాజా పట్టీలో దాడి చేశాయి. ఆ సమయంలో ముస్తాహా సహా హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ ఉన్నారు. ఆ దాడిలో వారు ముగ్గురు చనిపోయినట్లు తాజాగా ఐడీఎఫ్‌ ధృవీకరించింది. 
 
వీరంతా సొరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు ఖచ్చితమైన సమాచారం లభించింది. ఈ క్రమంలో ఫైటర్ జెట్ల సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి ఇజ్రాయెల్ దళాలు. అయితే, హమాస్ మాత్రం ముస్తాహా సహా ఈ ముగ్గురి మరణాలను ధృవీకరించలేదు. ఆ మిలిటెంట్ సంస్థ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకే నష్టాలను దాస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంటోంది.  
 
2015 నుంచి ముష్తాహ్‌ను గ్లోబ‌ల్ ఉగ్ర‌వాదిగా అమెరికా ప‌రిగ‌ణించింది. హ‌మాస్ పోలిట్‌బ్యూరో స‌భ్యుడిగా సిరాజ్‌, అంత‌ర్గ‌త సెక్యూర్టీ ఏజెన్సీ నేత‌గా ఓదేహ్ ఉన్న‌ట్లు ఈసీఎఫ్ఆర్ పేర్కొన్న‌ది. రావి ముస్తాహా హమాస్ చీఫ్ యాహ్వా సిన్వార్‌కు ప్రధాన అనుచరుడిగా భావిస్తారు. వీరిద్దరు కలిసి ఇజ్రాయెల్ జైల్లో సుదీర్ఘకాలం ఉన్నారు.
 
 ఆ తర్వాత వీరే హమాస్ జనరల్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యుద్ధ సమయంలో గాజాలో ప్రజలను నియంత్రించడంలో ముష్తాహానే కీలక పోషించినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ఈ క్రమంలోనే ముస్తాహా లక్ష్యంగా దాడులు జరిపి అతడ్ని అంతమొందించింది.
 
 ముస్తాహా మరణంతో హమాస్ దళాల మోహరింపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. మరోవైపు, యాహ్యా సిన్వార్ జాడ లేకుండా పోయిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సిన్వార్ ప్రస్తుతం గాజా పట్టీలోని బంకర్లలో ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది.