ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్‌ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో టెల్‌ అవీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. పలు భవనాలు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. 
 
పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇజ్రాయల్‌ హెచ్చరికలు జారీ చేసింది. వేలాది మందిని బాంబు షెల్టర్లకు తరలించింది. దాడులను అడ్డుకోవడానికి తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది.  ఇజ్రాయెల్‌ నగరాలైన టెల్‌అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్‌ అడ్డుకోగలిగింది. 
 
కానీ కొన్ని క్షిపణులు నేరుగా నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ, తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.  హెజ్‌బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించడం గమనార్హం. 

ఇరాన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్‌ సమాచారం ఇచ్చింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణుల్ని వాడినట్లు అధికారికంగానూ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ గట్టిగా హెచ్చరించింది.

ఇరాన్‌ దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కనే ఉన్న రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఇరాన్‌ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తమ దళాలకు ఆదేశాలు జారీచేశారు.

ఇరాన్‌ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. దీంతో ఈ పోరు మరింత విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని జఫ్ఫాలో ఇద్దరు సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ఇజ్రాయెలీలు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు.

ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడటంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌ భారీ తప్పిదానికి పాల్పడిందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని నిరంకుశ పాలనను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు. ఇది శాంపిల్‌ మాత్రమేనని.. అసలు దాడులు త్వరలోనే ఉంటాయని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ హెచ్చరించారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు.ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇరాన్‌ను హెచ్చరించారు.