
* హైడ్రా నుండి దృష్టి మళ్లించడం కోసమేనా విడాకులపై ఆరోపణలు!
రెండేళ్ల క్రితం జరిగిన నాగ చైతన్య- సమంతల విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ ఇప్పుడు చేసిన వాఖ్యలు దుమారం రేపడంతో ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. నటి సమంతకు సంబంధించి బుధవారం తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఆమెకు క్షమాపణలు చెప్పారు.
తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని, కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు.
స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఆమె కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అన్యధా భావించవద్దని మంత్రి సురేఖ కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
“నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే. కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బ తీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే, బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు” అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కారణంగానే నాగ చైతన్య- సమంతలు విడాకులు తీసుకోవాల్సి వచ్చిమదంటూ సందర్భంగా లేకుండా మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని ఆమె ఆరోపించారు.
కేవలం హైడ్రా కూల్చివేతల పట్ల పెరుగుతున్న ప్రజాగ్రహం నుండి వారి దృష్టి మళ్లించడం కోసమే ఆమె ఈ వాఖ్యలు చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్త్ర హైకోర్టు ఈ కూల్చివేతలపై ఆగ్రవేశాలు వ్యక్తం చేయడం, ప్రతిపక్షాలు బాధితులకు బాసటగా వీధులలోకి వస్తుండటం, చివరకు రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు సహితం విమర్శలు చేస్తుండటంతో ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సినీ నటి, బీజేపీ మహిళా నేత కుష్బూ సుందర్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘సురేఖ మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలకు సురేఖ క్షమాపణలు చెప్పాలి’’ అని కుష్బూ సుందర్ డిమాండ్ చేశారు.
కాగా, కొండా సురేఖ విడాకుల గురించి చేసిన ఆరోపణల పట్ల అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సమంత సహితం విడివిడిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకోసం తమ కుటుంబాన్ని వివాదాల్లోకి లాగవద్దని స్పష్టం చేశారు. పైగా, పరస్పర ఆమోదంతో, పరస్పర గౌరవంతోనే విడాకులు తీసుకున్నారని, అందులో రాజకీయాల ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
కేటీఆర్ ఈ విషయమై ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన, తన గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్టప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడ్తానని ఆయన హెచ్చరించారు
`నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోండి’ అంటూ సమంత హితవు చెప్పారు. ‘‘స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి, ప్రేమలో నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి.. వీటన్నింటికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి” అంటూ ఆమె కోరారు.
“ఒక మంత్రిగా మీ మాటకు చాలా విలువ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనే మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే కొనసాగించాలనుకుంటున్నాను..’’ అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’’ అంటూ నాగార్జున ఓ పోస్ట్ చేశారు.
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందిస్తూ తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోవద్దని హితవు పలికారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలంటూ సూచించారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.
More Stories
అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధం
ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు
థాయ్ లో ‘మిస్ గోల్ఫ్’ `హనీ ట్రాప్’లో బౌద్ధ సన్యాసులు!