కోల్‌కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు

కోల్‌కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు
 
* మమత ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం
 
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిరసన ర్యాలీలో 15 నుంచి 20 మంది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ట్రైయినీ వైద్యురాలికి న్యాయం చేయలని, అలాగే పని ప్రదేశాల్లో తమకు రక్షణ కల్పించాలంటూ వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. 

ఆ క్రమంలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ ప్రాంతంలో సైతం వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించింది. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలి (కశ్మీర్ మంగే ఆజాదీ) అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు బిగ్గరగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అవకాశముందని కోల్‌కతా నగర పోలీసులు భావించారు. దాంతో ఆ వీడియోను పోలీసులు పరిశీలించారు.

అనంతరం కశ్మీర్ ఆజాదీ అంటూ నినాదాలు చేసిన వ్యక్తులపై న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ర్యాలీ నిర్వహకులకు మరికొద్ది రోజుల్లో పోలీసులు సమన్లు జారీ చేయ్యనున్నారని తెలుస్తుంది. మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని ఆ పార్టీ ప్రకటించింది.

మరోవైపు.. తమ డిమాండ్లను నేరవేర్చడంలో మమత బెనర్జీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మళ్లీ నిరవధిక నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు. పది రోజుల క్రితం ప్రభుత్వ చర్చల్లో భాగంగా తన డిమాండ్లలో కొన్నింటిని మమత ప్రభుత్వం ఆమోదించిందని గుర్తు చేశారు. 

కానీ వాటిని అమలు చేయలేదంటూ ప్రభుత్వంపై జూనియర్ డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 9వ తేదీన ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైదుర్యాలిపై హత్యాచార ఘటనలో ఆమెకు న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. అలాగే పని ప్రదేశాల్లో తమకు భద్రతతోపాటు రక్షణ సైతం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ మమత ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చారు. అందులో కొన్ని డిమాండ్లను మాత్రమే అమలు చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిరవధిక నిరసనలకు దిగాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు.