రాజధాని జంటనగరాల్లో జరిగే మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం, బాణాసంచా కాల్చడంపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఊరేగింపుల్లో ఇక నుంచి డీజే సౌండ్ సిస్టమ్, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిషేధం విధించారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని 100కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సమీక్షించిన పోలీసులు.. డీజేలపై నిషేధం విధించాలని నిర్ణయించారు.
ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజే వాడడం వలన తీవ్ర శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సీపీ ఈ విషయమై మతపెద్దలు, ఇతర సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి డీజే వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమానికి బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, శాసనసభ్యులు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో మతపరమైన ఊరేగింపులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆయా వేడుకల్లో ఉపయోగించే డీజే సౌండ్ వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు.
దీని వల్ల రక్తపోటు, వినికిడి సమస్యలు, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయని ఆనంద్ తెలిపారు. గత రెండేళ్లుగా డీజేలతో పెద్దయెత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఈసారి శృతిమించి జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని సీవీ ఆనంద్ తెలిపారు.
మరోవైపు బాణాసంచా కాల్చడం వల్ల ఒక్కోసారి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డీజే సౌండ్ వినియోగించడం నిషేధించారు. కాగా రాత్రి 10 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు డీజే సౌండ్ సిస్టమ్‌ను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం