విజయవాడ నగరంలోని 32 డివిజన్లను ముంచెత్తిన బుడమేరులో ఆక్రమణలను తొలగించడం ప్రస్తుతమున్న పరిస్థితులలో అంత సులభం కాదని తెలుస్తున్నది. అందుకోసమే రివర్ కన్సర్వేటివ్ యాక్టు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ చట్ట నిబంధనల ప్రకారం నదీ గర్భంలో ఏ రకమైన కట్టడాలకూ, సాగు చేసుకోవడానికీ అనుమతి ఉండదు. దీని పరిధిలో చేపలు పట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బుడమేరులో అక్రమణల తొలగింపునకు, భవిష్యత్తులో ఆక్రమణలను నివారించేందుకు ఈ చట్టం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం దృష్టికి జలనవరుల శాఖ తీసుకెళ్లింది. జలవనరుల శాఖలో పెద్ద వాగుగా మాత్రమే గుర్తించబడిన బుడమేరును రివర్ కన్సర్వేటివ్ యాక్టు పరిధిలోకి తీసుకురావడం కుదరదు.
ఈ నేపథ్యంలో కృష్ణా నదికి ఉప నదిగా చూపడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఆ శాఖ సర్వే నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా బుడమేరు పరీవాహక ప్రాంతం నుంచి ఏటా వస్తున్న నీటి ప్రవాహంలో కృష్ణా నదికి ఎంత మళ్లించబడుతోందనే అంశంపై అధికారులు సర్వే నిర్వహించారు. దీనిపై నివేదిక సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవహిస్తూ కైకలూరు వద్ద కొల్లేరు సరస్సులు కలుస్తోంది. కొల్లేరు సరస్సు ప్రత్యేక చట్ట పరిధిలో ఉన్నాయి. కాంటూరు పరిధిలో కూడా ఆక్రమణల తొలగింపు, నియంత్రణకు అవకాశం ఉంది. రివర్ కన్సర్వేటివ్ యాక్టుతోనే ఎక్కువగా నియంత్రణ చేయవచ్చని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు.
బుడమేరు ఆక్రమణలు తొలగించి నగరాన్ని వరదలు ముంచెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్, సర్వే, రెవెన్యూ విభాగాలు సర్వే పూర్తి చేశాయి. విజయవాడ నగర పరిధిలో 8.9 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తోంది. దీని వెడల్పు అత్యల్పంగా 90 మీటర్లు, అత్యధికంగా 180 మీటర్లు ఉండాలి.
దీని పరిధిలోని మొత్తం 202 ఎకరాల విస్తీర్ణంలో 70 ఎకరాలు అక్రమణలకు గురయ్యాయి. దీనిలో సుమారు మూడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి అదనంగా మధ్యకట్టపై మరికొన్ని నిర్మాణాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణల తొలగింపునకు తీసుకొచ్చిన హైడ్రా తరహాలో బుడమేరు ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. అయితే, వేలాది కుటుంబాలను తొలగించే క్రమంలో తలెత్తే సమస్యలు తలనొప్పిగా మారతాయని భావించి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తోంది.
విజయవాడ నగరంలో ఇళ్ల మధ్య నుంచి బుడమేరు ప్రవహిస్తోంది. దీన్ని మళ్లించడానికి తాజాగా గొల్లపూడి ఎత్తిపోతల పథకం కాల్వ, జక్కంపూడిలోని పాముల కాల్వను 30 తూముల వరకు పొడిగించే ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. విజయవాడ నగరం ముంపుకు గురి కాకుండా రిటైనింగ్ వాల్‌ను నిర్మించే ప్రతిపాదనలు పరిశీలిస్తుంది. కృష్ణా జిల్లాలో పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, పెదపారుపూడి, నందివాడ మండలాల మీదుగా బుడమేరు ప్రవహించి ఏలూరు జిల్లా కైకలూరులో కొల్లేరు సరస్సులో కలుస్తుంది.
అది పొంగిన సమయంలో ఆయా మండలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పొలాలు, ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ముంపు నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కట్టలు పటిష్టం చేయడం, ఛానలైజేషన్ చేయడం వంటి వాటిపై నివేదికలు రూపొందిస్తోంది. కొల్లేరు సరస్సును కూడా ఉప్పుటేరు వరకు ఛానలైజేషన్ చేసి అక్కడ రెగ్యులేటర్ నిర్మించి సముద్రంలో కలపాలనే ప్రతిపాదనలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. దీనిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

More Stories
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి
ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ!