అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు

అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు
అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. 15 రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బేగంపేట హరితాప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు సమావేశానికి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

పార్టీ సభ్యత్వ నమోదుపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటిస్తున్న జేపీ నడ్డా శనివారం ఉదయం బీహార్​లో సభ్యత్వ నమోదు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3: 30కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు.

 రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై జేపీ నడ్డా ఆరా తీశారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 77 లక్షల ఓట్లు, ఎనిమిది సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

77లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదని పేర్కొంటూ  అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.  వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని జేపీ నడ్డా ఆదేశించారు. నేతల మధ్య విభేదాలు లేకుండా సమన్వయంతో సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. 

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం అంశాలపైన అరా తీసినట్లుగా సమాచారం. కాగా హైదరాబాద్​కు ఇటీవలే బీజేపీ సభ్యత్వ నమోదు ఇంఛార్జి అభయ్ పాటిల్ సందర్శించారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీశ్రేణులతో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సభ్యత్వ ఇన్‌చార్జి అరవింద్ మీనన్, సంస్థగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి తదితరులు హాజరయ్యారు.