ఎన్సీపీతో పొత్తు బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు

ఎన్సీపీతో పొత్తు బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు
అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ప్రధాన ఓటర్లకు ఇష్టం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వాఖ్యలు చేశారు.  లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ తిరోగమనానికి ఇది ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కంటే బీజేపీ చెత్త ప్రదర్శన ఇదేనని తెలిపారు. ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే శివసేన, బీజేపీ, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ కలిసి 28 స్థానాల్లో పోటీ చేశాయని చెప్పారు. అయితే అధికారంలో ఉన్న తమ కూటమికి చాలా తక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు.

కాగా, షిండే శివసేన (7), అజిత్ పవార్ ఎన్సీపీ (1) కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, 9 సీట్లు గెలుచుకున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. విడిపోయిన ఆ రెండు పార్టీలు ఒక విధంగా కొత్త పార్టీలని చెప్పారు. స్థిరమైన ఓటర్లు లేకపోవడం లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కష్టంగా మారిందని తెలిపారు. ‘ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ‘కోర్ ఓటర్ బేస్’కు నచ్చలేదు’ అని మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు ప్రస్తుతం రాజకీయంగా రాజీలు అవసరమన్నది 80 శాతం బీజేపీ ఓటర్లు నమ్ముతున్నారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే ప్రస్తుతం షిండే శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీలో కూడా ఓటర్ల శాతం స్థిరత్వానికి చేరిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్యలు పునరావృతం కావని ఆశాభావం వ్యక్తం చేశారు.