పాకిస్తాన్ కంపెనీలకు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్?

పాకిస్తాన్ కంపెనీలకు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్?
మూసీ సుందరీకరణ పనుల ప్రాజెక్టులను పాకిస్తాన్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు సంచలన ఆరోపణలు చేశారు. మూసీ నది శుద్ధి వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం వేరే ఉందని, మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోందని కేటీఆర్ తెలిపారు.
 
హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల భారీ స్కా్మ్ జరుగుతోందని చెబుతూ భ‌విష్య‌త్‌లో అన్ని విష‌యాల‌ను ప్ర‌జ‌ల దృష్టికి తీసుకువ‌స్తామని చెప్పారు.  కొత్తగా మూసీ నదిని శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ గతంలో తమ ప్రభుత్వం నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాలు-ఎస్టీపీలను వినియోగించుకోవాలని సూచించారు. 
 
ఇక మన దేశంలో 31 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్న ఏకై‌న నగరం హైదరాబాద్ అని కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌తి రోజు ఉత్ప‌త్తి అయ్యే 20 కోట్ల లీట‌ర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాల‌నే ఉద్దేశంతో రూ. 4 వేల కోట్ల‌తో 31 ఎస్టీపీల‌కు శ్రీకారం చుట్టామ‌ని చెబుతూ ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు మూసీలోకి వెళ్తుందని తెలిపారు. 
 
94 శాతం స్వ‌చ్ఛ‌మైన నీరు వెళ్తున్న‌ప్పుడు మూసీ శుద్ధి ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదంటూ సీఎం రూ. ల‌క్షా 50 వేల కోట్లు అని అంట‌డు. మంత్రులేమో రూ. 50 వేల కోట్లు, ఇంకొంద‌రేమో రూ. 70 వేల కోట్లు అని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మాట‌ల‌ను చూస్తుంటే మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది అనే అనుమానం ప్ర‌జల్లో క‌లుగుతుంద‌ని కేటీఆర్ తెలిపారు.