కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి

కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి

కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని, కుమారి సెల్జా వంటి పలువురు నేతలను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము ఆయనను గౌరవించేందుకు పంచతీర్థాన్ని స్థాపించామని, సంవిధాన్ దివస్ ప్రకటించామని తెలిపారు. 

హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తోహాణాలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న షా, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. “అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడారు. వారి (కాంగ్రెస్) అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లను ఎత్తి వేస్తారు. మన హరియాణా పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. మీకు రిజర్వేషన్లు కావాలా వద్దా?” అని ప్రశ్నించారు. 

 ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను రక్షించగల వ్యక్తి ఎవరైనా ఉంటే అది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే అని అమిత్ షా స్పష్టం చేశారు.  “రాహుల్ బాబా.. మీరేం మాట్లాడుతున్నారు? సిక్కు సమాజాన్ని అగౌరవపరిచిన చరిత్ర మీకు ఉంది. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఢిల్లీ అల్లర్లలో వేలాది మంది సిక్కులు రోడ్లపై హత్యకు గురయ్యారు. పిల్లలు, మహిళలను కూడా విడిచిపెట్టలేదు” అంటూ అమిత్ షా విమర్శించారు. 

“మీరు ఏదైనా చేయాలనుకుంటే తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లి సిక్కు సోదరులకు క్షమాపణ చెప్పండి” అంటూ హితవు చెప్పారు. అగ్నివీర్ గురించి రాహుల్ బాబా యువకులను తప్పుదారి పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. 

హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఢిల్లీ మధ్యవర్తులు ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రాన్ని మధ్యవర్తుల చేతుల్లో పెట్టాలనుకుంటున్నారా?అని ప్రజలను ప్రశ్నించారు అమిత్ షా. జమ్మూకాశ్మీర్‌ ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీతోపాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు కూడా ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామని, ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు.

హర్యానా ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి హర్యానానే ఉదాహరణ అని హోంమంత్రి చెప్పారు.  గతంలో హర్యానాలో రెండు వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తూ పోతుండేవిని, ఒక పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి పెరిగిపోయిందని, మరో పార్టీ అధికారంలోకి రాగానే గూండాయిజం పెరిగిందని ధ్వజమెత్తారు. 

రెండు పార్టీల్లోనూ ఆశ్రిత పక్షపాతం, కులతత్వం తారాస్థాయికి చేరుకున్నాయని చెబుతూ  ఇలాంటి సమయంలోనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకముందు ఉద్యోగం పొందాలంటే కచ్చితంగా ముడుపులు ముట్టజెప్పాల్సిందే.  కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు.