పక్కన ఖాళీ కుర్చీతో ముఖ్యమంత్రిగా ఆతిశీ

పక్కన ఖాళీ కుర్చీతో ముఖ్యమంత్రిగా ఆతిశీ
ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆతిశీ, రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే కేజ్రీవాల్‌ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు ఢిల్లీ సీఎంగా పని చేస్తానని చెప్పారు.
కేజ్రీవాల్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని ఆతిశీ విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతిశీ 5 నెలలు మాత్రమే ఢిల్లీ సీఎంగా ఉండనున్నారు.

“నేను ఢిల్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే నాకు ప్రస్తుతం రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితే ఎదురైంది. రాముడి వనవాస సమయంలో భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఎలాంటి బాధ కలిగిందో, ఇప్పుడు నాకు అలాగే బాధగా ఉంది. రాముడి 14ఏళ్ల వనవాసం సమయంలో సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు” అంటూ ఆమె గుర్తు చేశారు. 

“వచ్చే నాలుగు నెలలు నేను కూడా అలాగే పరిపాలిస్తాను. అరవింద్ కేజ్రీవాల్‌ గౌరవం, నైతికతకు ఉదాహరణగా నిలిచారు. గత రెండేళ్లుగా బీజేపీ ఆయన ఇమేజ్​ను దిగజార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి, ఆరు నెలలు జైల్లో ఉంచింది. దీంతో ప్రజల్లో తిరిగి విశ్వసనీయత పొందేవరకు సీఎం సీటులో కూర్చోనన్నారు కేజ్రీవాల్. అందుకే రాజీనామా చేశారు” అని ఆమె చెప్పుకొచ్చారు. 

అయితే, ఢిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్​దే, ఢిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తున్నను అంటూ ఆమె భరోసా వ్యక్తం చేశారు.  అప్పటివరకు ఈ ఖాళీ కుర్చీ ఈ ఆఫీస్​లోనే ఉంటుందని, కేజ్రీవాల్​ కోసం ఎదురుచూస్తుందని ఆతిశీ పేర్కొన్నారు.

అయితే ఆతిశీ చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆమె ఖాళీ కుర్చీని చూపించడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందని బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీ విమర్శించారు. దాని అర్థం, ఆమె తనను తాను సీఎం పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎంగా ఉండి, మరో వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకోవడం, ఆ స్థానాన్ని, రాజ్యాంగాన్ని అగౌరపరచడం అని ఆయన మండిపడ్డారు.  “నేను డిల్లీ సీఎంకు ఓ లేఖ రాశాను. అయితే ఆ లేఖను ఎవరు చదువుతారు? ఒక సీఎం, తాను కీలుబొమ్మ అని ఎలా చెప్పుకోగలరు? వారు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు” అని మనోజ్​ తివారీ మండిపడ్డారు.

లాలు ప్రసాద్ యాదవ్- రబ్​డీ దేవి, మన్​మోహన్​- సోనియా మోడల్​ లాగా ఆతిశీ- కేజ్రీవాల్​ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్​ భండారీ విమర్శించారు. రబ్బర్​ స్టాంప్​, కీలుబొమ్మ ముఖ్యమంత్రిని సీఎంగా ఎందుకు చేశారని ఢిల్లీ ప్రజలు ప్రశ్నిస్తున్నారని భండారీ తెలిపారు. “ఢిల్లీ ప్రజలంటే ఆతిశీ, కేజ్రీవాల్​కు ద్వేషం. వారు ఢిల్లీ ప్రజలకు ఒక తాత్కాలిక సీఎంను ఇవ్వలేకపోయారు. కానీ ఒక కీలుబొమ్మ​ సీఎంను ఇచ్చారు” అని బంఢారీ ధ్వజమెత్తారు.
 
కాగా, ఆతిశీతో పాటు పర్యావరణ శాఖ మంత్రిగా గోపాల్​ రాయ్​, కార్మిక ఎస్​సీ, ఎస్​టీ, ఉపాధి, భవనాల శాఖ మంత్రిగా ముఖేశ్​ అహ్లావత్​ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 26, 27వ తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. విద్య, రెవెన్యూ, ఆర్థిక, విద్యుత్‌ సహా 13 మంత్రిత్వ శాఖలు ఆతిశీ వద్ద ఉన్నాయి.