
కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కొంగు బంగారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం పట్ల కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏటా కోట్ల మంది దర్శించుకునే తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది ప్రజల విశ్వాసానికి తూట్లు పొడవడమే అని స్పష్టం చేశారు.
హిందువుల, ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అంటూ ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన నేరస్థులకు తగిన శిక్ష పడాలని స్పష్టం చేశారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవిదేశాల నుంచి నిత్యం లక్షలాది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని, పరమ పవిత్రమైన, ఎంతో ప్రశస్తమైన లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తారని తెలిపారు. ఇంత పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులను, చేపనూనెలను వినియోగించడం క్షమించరాని నేరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి, తగిన శిక్ష పడేలా చేయాలని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు తిరుపతిలో అన్య మత ప్రచారం, తిరుమల కొండపైకి మద్యం, మాంసాహారాన్ని తీసుకెళ్లడం, టీటీడీలో అవినీతి అక్రమాలు గత కొన్నేళ్లుగా పతాక శీర్షికలవుతున్నాయిని అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర గతంలో జరిగిన నేపథ్యంలో వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులను శిక్షించి, తిరుమల పవిత్రతను కాపాడే, భక్తుల మనోభావాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని సంచలనాత్మకంగా మార్చవద్దని రాజకీయ పార్టీలకు, ధార్మిక సంస్థలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పదేపదే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందని పేర్కొంటూ, ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని ఆయన కోరారు.
More Stories
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్కి చెందిన విద్యార్థి మృతి
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది