ఈనెల 25న వరద బాధితులకు పరిహారం

ఈనెల 25న వరద బాధితులకు పరిహారం

విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ప్యాకేజీని ఈ నెల 25న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరద నష్టం గణన, పరిహారం చెల్లింపుపై మంత్రులు నారాయణ, అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నష్టం అంచనా ప్రక్రియ పూర్తైందని సీఎంకు అధికారులు తెలిపారు. 

నష్టపరిహారం విషయంలో అర్హులకు అన్యాయం జరిగిందనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. విజయవాడ వరద బాధితుల్లో గ్రౌండ్ ఫ్లోర్ బాధితులకు రూ. 25 వేలు, మొదటి అంతస్తు ఆపై ఫ్లోర్ల బాధితులకు రూ. 10 వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ఇటీవలే ప్రకటించారు.

ఇళ్లు మునిగిన వారితోపాటు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు దెబ్బతిన్న రైతులకూ పరిహారం డబ్బును బాధితుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం జమ చేయనున్నారు. వరదల్లో 10 వేల వాహనాలు దెబ్బతినగా, ఇప్పటిదాకా 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తైందని అధికారులు వివరించారు. మిగతా వాటికీ పూర్తయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.

చిరు వ్యాపారులకు రూ.25 వేలు, వరదల్లో మునిగిన బైకులకు 3 వేలు, త్రిచక్రవాహనాలకు  రూ.10 వేలు పరిహారం ప్రకటించారు. అదే విధంగా చేనేత కార్మికులకు రూ.15 వేలు, మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు రూ. 25 వేల సాయం అందిస్తామని చెప్పారు. ఫిషింగ్‌ బోట్లకు నెట్‌ దెబ్బతిని పాక్షిక ధ్వంసమైతే రూ.9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు ఇస్తామన్నారు. నెట్‌ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైన మోటార్‌ బోట్లకు రూ.25 వేలు ప్రకటించారు.

హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు ప్రకటించారు. అదే విధంగా హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్‌ చెరకుకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు, సోయాబీన్‌, పొద్దుతిరుగుడుకు రూ.15 వేలు, జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు ఇస్తామని ఇటీవల చంద్రబాబు తెలిపారు.

పసుపు, అరటి, మిరప, నిమ్మ, జామ, మామిడి, కాఫీ, దానిమ్మ, సపోట, డ్రాగన్‌ ఫూట్‌కి రూ.35 వేల చొప్పున, కూరగాయలు, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లిపాయ, పుచ్చకాయ, నర్సరీకి రూ.25 వేలు అందిస్తామన్నారు. పామాయిల్‌ చెట్టుకు రూ.1500, సెరీకల్చర్‌కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయాన్ని ప్రకటించారు.