ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించం

ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించం
హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిమయమని కేంద్ర హోం అమిత్‌షా విమర్శించారు.  రైతులకు దన్నుగా నిలచి, ఉద్యోగావకాశాలను కల్పించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖాండ్‌లో ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జార్ఖాండ్‌లో 2024 ఎన్నికలకు సంబంధించిన బీజేపీ పరివర్తన ర్యాలీని హోం మంత్రి శుక్రవారంనాడు ప్రారంభించారు. 
 
ఇక్కడి నుంచి మొదలైన పరివర్తన యాత్ర రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి, ఇంటింటికి చేరుకుంటుందని చెప్పారు. జేఎంఎం, కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడంతోనే మార్పు జరిగినట్టు కాదని, అవీనీతి ప్రభుత్వాన్ని తొలగించి, అవీనితికి అడ్డుకట్ట వేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పారు. 
 
చొరబాటుదారుల చేతుల్లో గిరిజన యువతులు, సంస్కృతి తల్లడిల్లుతోందని పేర్కొన్నారు. రైతులు, స్థానికంగా ఉపాధి కల్పించే ప్రభుత్వానికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలుస్తోందని, రైతుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గిరిజన యువతీ యువకులు ఉద్యోగం కోసం దేశంలోని వేరే ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు. 
 
రాష్ట్రంలో చొరబాటుదారుల సమస్యను తాము పరిష్కరిస్తామని, ప్రభుత్వం మారితేనే చొరబాటుదారులను ఏరేయడం సాధ్యమని చెప్పారు. లాలూ యాదవ్, జార్ఖాండ్ ముక్తి మోర్చా, రాహుల్ బాబా (గాంధీ)లకు చొరబాటుదారులే ఓటు బ్యాంకు అని విమర్శించారు. ప్రభుత్వ మార్పునకు ప్రజలు అవకాశమిస్తే జార్ఖాండ్‌లోని ప్రతి చొరబాటుదారుని తాము వెనక్కి పంపిస్తామని హామీ ఇచ్చారు. 
 
గిరిజనుల స్థానంలో చొరబాటుదారులు పెరుగుతున్నారని, దీన్ని ఆపితీరాలని, ఆపని ఒక్క బీజేపీతోనే సాధ్యమని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఐదు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిన హేమంత్ సోరెన్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.  ఉద్యోగాలకు బదులుగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఒకటి తర్వాత ఒకటి పేపర్ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని, అవినీతి మినహాయిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. 81 మంది సభ్యులున్న జార్ఖాండ్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.