ఓ ప్రదేశాన్ని పాకిస్థాన్ తో పోల్చిన న్యాయమూర్తి!

ఓ ప్రదేశాన్ని పాకిస్థాన్ తో పోల్చిన న్యాయమూర్తి!
మైసూర్‌లోని నిర్దిష్ట ప్రాంతం పాకిస్థాన్‌లో ఉందంటూ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను నివేదిక కోరింది. “హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుండి నివేదిక కోరిన తర్వాత మేము కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలను నిర్దేశిస్తాము” అని సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి తెలిపింది.
 
కర్నాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి నుండి పరిపాలనాపరమైన ఆదేశాలు కోరిన తర్వాత రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరుతూ, ధర్మాసనం ఈ విషయాన్ని బుధవారానికి పోస్ట్ చేసింది. బెంచ్ లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్య కూడా ఉన్నారు.
 
కోర్టు విచారణ సందర్భంగా కర్నాటక హైకోర్టుకు చెందిన శ్రీశానంద చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాలపై తమ దృష్టిని ఆకర్షించిన సీజేఐ, న్యాయమూర్తులకు హెచ్చరికలు జారీ చేశారు. “సోషల్ మీడియా యుగంలో, కోర్టు కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తారు. మనం తదనుగుణంగా వ్యవహరించాలి” అని చెప్పారు. 
ఓ ఇంటి ఓనరు, కిరాయిదారు కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మైసూర్ లో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ఓ ప్రదేశాన్ని ‘పాకిస్థాన్’ తో పోల్చారు.  ఆగస్టు 28న కేసు విచారణ సందర్భంగా ఆయన ‘‘మైసూరు రోడ్డు ఫ్లయ్ ఓవర్ వైపు వెళుతుండే…ప్రతి ఆటో రిక్షా డ్రైవర్ 10 మందిని ఎక్కించుకుని నడుపుతుంటాడు” అని చెప్పారు. 
 
“మార్కెట్ నుంచి మైసూరు రోడ్డు ఫ్లయ్ఓవర్ వరకు ఉన్న ప్రదేశం ‘ఇండియాలో కాక పాకిస్థాన్’ లో ఉన్నట్లు ఉంటుంది. ఇది వాస్తవం. మీరు ఎవరైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని అక్కడి పంపితే అతడిని పట్టుకు తంతారు. దీనిని ఏ ఛానల్ వాళ్లు చూయించరు’’ అని వ్యాఖ్యానించారు.
 
ఆయన అన్న విషయాలున్న  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఆయన రెంట్ కంట్రోల్ యాక్ట్ అంశాలు, డ్రైవర్ ల ఇన్సూరెన్స్ కవరేజ్ విషయాల మీద కూడా చర్చించారు. వాహనాలు నడిపే వేగంపై, స్కూటర్ పై వెళ్లే వారి సంఖ్యపై కూడా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలీసుల చేతకానితనాన్ని కూడా ఎత్తి చూపారు. ఆయన అభిప్రాయాలను తప్పుడు కోణంలో కాక, అంశాలను అర్థం చేసుకునే దృష్టితో చూడాలి.