మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు.
శుక్రవారం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నేర్పించారని చెప్పారు. ఈ వారాంతంలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని చెబుతూ అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారని తెలిపారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదని ఆయన స్పష్టం చేశారు.
రెండేళ్లకోసారి ఏఎన్నాఆర్ అవార్డులు ఇస్తున్నామని, ఈ సారి చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అలాగే బాపుగారు గీసిన ఏఎన్నార్ చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ రూపంలో విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున తెలిపారు.
ఇదే కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి అక్కినేనిగారి అభిమానిని. అలాంటిది అక్కినేనిగారి పక్కన నటించే అవకాశం నాకు లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై తెరకెక్కిన మొదటి సినిమాలో నేనే హీరో. ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు నేనే అని అక్కినేని సర్టిఫికేట్ ఇచ్చారు. అంతకంటే ఇంకేం కావాలి. హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసిన తొలి వ్యక్తి అక్కినేని..’’ అని చెప్పుకొచ్చారు.
అక్కినేని శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఆల్ టైమ్ గ్రేట్ నటుల్లో ఒకరైన నాగేశ్వరరావుని ఆయన శత జయంతి రోజున స్మరించుకుందామని సూచించారు. నాగేశ్వరరావు నటనా మేధావి అన్న ఆయన, అద్భుతమైన నటనా ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారని కొనియాడారు.
సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని చెబుతూ మెకానిక్ అల్లుడు సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కిందని గుర్తు చేసుకున్నారు. ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తానని మెగాస్టార్.. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి