
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగంపై పెద్ద దుమారం రేగుతోంది. ఇదే విషయంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందిస్తూ తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ అది లాభం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు.
పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు పేర్కొన్నారు. కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకురాలేదని చెప్పారు. దీంతో గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని ఆదేదన వ్యక్తం చేశారు.
నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానని, ఆ రిపోర్ట్‌లో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉందని రమణ దీక్షితులు వివరించారు. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీనికోసం ముఖ్యమంత్రి ఎన్నో చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని రమణదీక్షితులు తెలిపారు.
ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలిపిన విషయం తెలిసి అంతా తీవ్రమైన కలత చెందామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని, ఈ విషయంలో సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ ప్రకటించారు.
మరోవైపు ఇది దేవాలయాల అపవిత్రత, వాటికి ఉన్న భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చిందని చెప్పారు. మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ చెప్పారు.
జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా అన్ని వర్గాలలో ఈ విషయంలో చర్చ జరగాలని చెబుతూ ‘సనాతన ధర్మాన్ని’ ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి మనమందరం కలిసి రావాలని భావిస్తున్నట్టు చెప్పారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం