
జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో ఒక వంక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు పాకిస్తాన్ అజెండాను అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆరోపణలు చేస్తుండగా, ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొనడం కలకలం రేపుతోంది. పాక్ మంత్రి వాఖ్యలపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతుంది.
దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో బుధవారం ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రస్తావించింది. అయితే, ఆర్టికల్ 370పై మాత్రం మౌనం వహించింది. ఇదే సమయంలో పాక్‌లో జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాంకర్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై అడిగిన ఓ ప్రశ్నకు స్పందించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయన్నాయని, ఆ పార్టీలకే విజయ అవకాశాలున్నాయని తెలిపారు. పైగా, కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ అమలు చేసిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్‌కు చెందిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, కశ్మీర్‌లో షేక్ అబ్దుల్లా అధికారంలో ఉన్నారని చెప్పారు.
తాజాగా ఇద్దరు కలిసి కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొనడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ఇది జరిగితే చాలా బాగుంటుందని, ఆర్టికల్ 370, 35ఏపై లకాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానంతోనే తాము ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. పాక్ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రి ఖవజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)లు పాకిస్థాన్ ఎజెండాను అనుసరిస్తున్నాయని విమర్శించారు. హింస, అశాంతే ఆ ఎజెండాగా పేర్కొన్నారు.
‘కాంగ్రె్‌సకు వేసే ప్రతి ఓటూ ఎన్‌సీ, పీడీపీల మేనిఫెస్టోల అమలుకు అవకాశం కల్పిస్తుంది. 370ని పునరుద్ధరించి మళ్లీ హింస, రక్తపాతాల కాలం తీసుకొస్తామని ఆ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కాంగ్రె్‌స-ఎన్‌సీ పొత్తుపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ పొరుగుదేశం మాత్రం తెగ సంతోషిస్తోంది. ఆసిఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, ఎన్‌సీ బండారం బయటపడింది’ అని శ్రీనగర్, కట్రా సభల్లో ప్రసంగిస్తూ ప్రధాని హెచ్చరించారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల బంధం అత్యంత ప్రమాదకరమైనదని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన ప్రతిపక్ష కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని మరోమారు బహిర్గతం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన పారీ, పాకిస్తాన్ బాణీ ఎప్పుడూ ఒకటేనని, జాతి వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కుమ్మక్కవుతూనే ఉందని కూడా ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఇప్పటికే అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేత అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో స్పందిస్తూ పాక్ ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశమని, ఆ దేశం కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరికి మద్దతు ఇస్తుందని విమర్శించారు.
ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడంపై సీపీఐ నేత డీ రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి తలదూర్చడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌కూ ఇది వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ అనంతరం పాకిస్తాన్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన నిలదీశారు.
భారత్ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం నివారించాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ ప్రజలు పరిణితి చెందిన వారని, జమ్ము కశ్మీర్‌కు, దాని భవిష్యత్‌కు ఏం చేయాలనేది వారికి స్పష్టంగా తెలుసునని ఆయన భరోసా వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, పాక్ కనుసన్నల్లో నడుస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ జమ్ము కశ్మీర్ ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన ఈ విషయం విస్పష్టంగా వెల్లడిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ట్యూన్స్‌కు వీరు డ్యాన్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తోలుబొమ్మల్లా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఆర్టికల్ 370పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడం పట్ల ఫరూక్ అబ్ధుల్లా స్పందిస్తూ పాకిస్తాన్ ఏం చెప్పిందనేది తనకు తెలియదని తెలిపారు. తాను పాకిస్తానీ కాదని, భారత పౌరుడినని ఆయన స్పష్టం చేశారు.
More Stories
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము