హింసను విడనాడాలని, ఆయుధాలను విడిచి పెట్టి లొంగిపోవాలని దేశంలోని నక్సలైట్లందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేకపోతే పూర్తి స్థాయిలో నక్సల్ నిర్మూలన ఆపరేషన్‌ను నిర్వహిస్తామని హెచ్చరించారు. నక్సలికజానికి వీడ్కోలు పలికేందుకు 2026 మార్చి 31 తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్‌గఢ్ నక్సల్స్ బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. హింసను వీడాలని నక్సల్స్‌ను వేడుకుంటున్నానని, ఆయుధాలను విడిచిపెట్టాలని, ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించిన తరహాలో నక్సల్స్ లొంగిపోవాలని, ఒకవేళ మీరు వినకుంటే, అప్పుడు నక్సల్ నిర్మూలన చర్యలు చేపడుతామని షా పేర్కొన్నారు.
మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్లలో.. భద్రతా దళాలు ప్రగతిని సాధించాయని తెలిపారు. ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితం అయినట్లు ఆయన వెల్లడించారు. ‘దేశంలో నక్సల్ హింస, సిద్ధాంతాలను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని కేవలం నాలుగు జిల్లాకే పరిమితమైంది. మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయి’ అని తెలిపారు.
`నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్ గతంలో నిర్ణయించారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ఎత్తులను చిత్తు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది. దీని ద్వారా ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తాం’ అని అమిత్ షా భరోసా ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లోని 55 మంది నక్సల్ బాధితులు తమకు న్యాయం చేయాలని గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రదర్శనలు చేశారు. ‘బస్తర్ శాంతి సమితి’ పేరుతో ర్యాలీని నిర్వహించారు. నక్సల్ ఏర్పాటు చేస్తున్న ల్యాండ్ మైన్స్ వల్ల ప్రాణాలను కోల్పోతున్నామని, వారి నుంచి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.
మహిళలు సురక్షితంగా లేరని, ఒంటరిగా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. బాలికలకు సరైన విద్య కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అమిత్ షా శుక్రవారం నక్సల్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని హింసను విడిచిపెట్టాలని నక్సల్స్ అందరిని హెచ్చరించారు. వారికి ఓ సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. నక్సల్ ప్రభావిత ప్రజల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని… ఉద్యోగాలు, హెల్త్‌కేర్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
More Stories
పంజాబ్‌లో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ జోటా కాల్చివేత
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్‌పై కఠిన చర్యలు
గర్భిణీ జర్నలిస్టును నెట్టి పారేసిన రాహుల్ గాంధీ?