కాంగ్రెస్ – బిజెపి అధ్యక్షుల మధ్య లేఖల యుద్ధం!

కాంగ్రెస్ – బిజెపి అధ్యక్షుల మధ్య లేఖల యుద్ధం!
దేశంలోని రెండు ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌ అధ్యక్షుల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. కేంద్రమంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని దేశంలో నెంబర్‌ వన్‌ టెర్రరిస్టు అని, అతిపెద్ద శత్రువు అని దూషించారు. అలాగే బిజెపి మరో సీనియర్‌ నేత ఇందిరాగాంధీ, మహత్మాగాంధీ, రాజీవ్‌గాంధీల గతే తనకు పడుతుందని రాహుల్‌ని బెదిరించారు. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.  కాగా, ఖర్గే ప్రధానికి లేఖ రాసిన రెండు రోజలు తర్వాత బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్‌ అధ్యక్షుడుకి గురువారం హిందీలో మూడు పేజీల లేఖను రాశారు.
 
 ‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడినందుకే బిజెపి నేతలు ఆయనపై అలాంటి పదాలు ఉపయోగించారు’ అని జెపి నడ్డా ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొనారు. దేశ ప్రధాని నరేంద్రమోదీతో సహా ఇతర వెనుకబడిన తరగతుల వారిని రాహుల్‌ ‘దొంగ’ అని పిలిచారని, అసభ్యపదజాలం ఉపయోగించిన చరిత్ర రాహుల్‌కి ఉందని గుర్తు చేశారు. 
 
“మీ రాజకీయ విఫల ప్రయత్నాల్లో భాగంగానే ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దేశంలో పురాతన రాజకీయ పార్టీ ఇప్పుడు దాని ప్రసిద్ధ యువరాజు ఒత్తిడితో ‘కాపీ అండ్‌ పేస్ట్‌’ పార్టీగా మారడం బాధాకరం అని నడ్డా తన లేఖలో తెలిపారు.
 
మంగళవారం ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో ‘బిజెపి నేతలు అన్న వ్యాఖ్యలు తీవ్రంగా కలవరపరిచేవిగా ఉన్నాయి. ఇవి భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు అత్యంత ప్రమాదకరమైనవి కాబట్టి వాటిపై చర్చించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో సిట్టింగ్‌ మంత్రులు ప్రతిపక్షనాయకుడిని ఉద్దేశించి ఇటువంటివి అనేక వ్యాఖ్యలు చేశారు’ అంటూ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
“మీ కూటమిలోని రాజకీయ నాయకులు ఉపయోగించిన హింసాత్మక భాష మా భవిష్యత్తుకు, దేశానికి పెను ప్రమాదంగా పరణమించింది. దేశ ప్రధానిగా మీరు మీ మిత్రపక్షాలకు మార్గనిర్దేశం చేయాలి. అటువంటి వ్యాఖ్యలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఖర్గే పేర్కొన్నారు.