
ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. గత ఆగష్టు 15న ఎర్రకోట నుండి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై స్పష్టం చేశారు. సంవత్సరం పొడవునా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. వీటి కారణంగా దేశ పురోగతిపై ప్రభావం పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెప్పారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ లోక్ సభ ఎన్నికల ప్రకటనకు ముందు మార్చి నెలలో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికిి సమర్పించింది.
ఆ నివేదికపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించి, జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను కేబినెట్ ముందు ఉంచడం న్యాయ మంత్రిత్వ శాఖ 110 రోజుల ఎజెండాలో భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వనరులను ఆదా చేయడం, అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడం, ‘భారత్ అంటే భారత్’ ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని కోవింద్ కమిటీ పేర్కొంది.
రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి కామన్ ఓటర్ల జాబితా, ఓటరు గుర్తింపు కార్డులను భారత ఎన్నికల సంఘం రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ బాధ్యత వహిస్తుండగా, మున్సిపాలిటీలు, పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి.
తొలుత జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.
More Stories
కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!